ఊపిరి నింపిన వెంటిలేటర్లు

ఊపిరి నింపిన వెంటిలేటర్లు

జిజిహెచ్ లో నాలుగు వెంటిలేటర్లు ప్రారంభం.
అత్యవసర సమస్యపై ఎంపీ చిన్ని చొరవ
బీడీఎల్ నుంచి రూ.50 లక్షల సీఎస్‌ఆర్ సాయం
తీవ్ర అనారోగ్య రోగులకు ఇక మెరుగైన అత్యవసర వైద్యం..
ప్రజా ఆరోగ్య అవసరాలపై స్పందించిన ఎంపీ చిన్ని జిజిహెచ్‌లో వైద్యసేవలకు కొత్త బలం

( ఆంధ్రప్రభ విజయవాడ)

విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో గత కొంతకాలంగా నెలకొన్న వెంటిలేటర్ల కొరతకు తెరపడింది. అత్యవసర పరిస్థితుల్లో చికిత్స పొందుతున్న రోగులకు ప్రాణాధారంగా నిలిచే వెంటిలేటర్ల కొరతతో వైద్యులు, రోగుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్న సమయంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని చొరవతో వెంటిలేటర్ల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ఎంపీ కేసినేని చిన్ని సూచనతో కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధుల కింద బీడీఎల్ సంస్థ రూ.50 లక్షల వ్యయంతో నాలుగు ఆధునిక వెంటిలేటర్లను జిజిహెచ్‌కు చేరుకున్నాయి.

.. సూపర్డెంట్ సూచనతో..

విజయవాడ జిజిహెచ్‌లో వివిధ విభాగాలకు అవసరమైన బయో మెడికల్ పరికరాల కొరతపై ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇటీవల ఎంపీ చిన్ని దృష్టికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో ఉన్న సమస్యలపై ప్రత్యేక లేఖ రాశారు. సమస్య తీవ్రతను గుర్తించిన ఎంపీ చిన్ని , వెంటనే స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ బీడీఎల్ యాజమాన్యానికి లేఖ రాశారు. ప్రజా ఆరోగ్య అవసరాలకు ప్రాధాన్యం ఇస్తూ ఎంపీ చేసిన విజ్ఞప్తికి బీడీఎల్ యాజమాన్యం సానుకూలంగా స్పందించి వెంటనే సీఎస్‌ఆర్ నిధులను మంజూరు చేసింది.

.. జిజిహెచ్ కు చేరిన నాలుగు వెంటిలేటర్లు..

ఎంపీ చిన్ని చొరవతో బీడీఎల్ సహకారంతో జిజిహెచ్‌కు చేరుకున్న నాలుగు ఆధునిక వెంటిలేటర్లు ఐసీయూ, అత్యవసర చికిత్స విభాగాల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. ఇప్పటివరకు వెంటిలేటర్ల కొరతతో తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించాల్సిన పరిస్థితులు ఉండేవి. తాజా ఏర్పాట్లతో అలాంటి ఇబ్బందులు గణనీయంగా తగ్గనున్నాయని వైద్యవర్గాలు చెబుతున్నాయి.
అతిపెద్ద ప్రభుత్వ వైద్యసంస్థల్లో ఒకటైన జిజిహెచ్‌లో అత్యవసర వైద్య సేవలకు ఈ పరికరాలు కొత్త ఊపిరిని నింపాయి. ప్రజా సమస్యలపై వెంటనే స్పందించి, కార్పొరేట్ వనరులను ప్రజా ఆరోగ్య రంగానికి మళ్లించడంలో ఎంపీ చిన్ని తీసుకున్న చొరవపై రోగులు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.