Narendra Modi Energy Saving | ప్రపంచ దేశాల్లో ఇంధన పొదుపు చర్యలు

Narendra Modi Energy Saving | ప్రపంచ దేశాల్లో ఇంధన పొదుపు చర్యలు
Narendra Modi Energy Saving | చమురు సంక్షోభంపై మోడీ హెచ్చరిక
వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ప్రాధాన్యం
విద్యుత్, ఏసీ వినియోగంపై నియంత్రణలు
ప్రయాణాలపై కట్టుదిట్టమైన ఆంక్షలు
స్కూళ్లు ఆన్లైన్ బాటలో
ఇంధన భద్రతకు ప్రపంచ దేశాల కీలక నిర్ణయాలు
Narendra Modi Energy Saving | న్యూఢిల్లీ: భౌగోళిక ఉద్రిక్తతలు, ప్రపంచ సంక్షోభాల వేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పొదుపు మంత్రాన్ని ఉపదేశించారు. దేశ ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు అప్రమత్తత అవసరమని సూచించారు. ముఖ్యంగా బంగారం కొనుగోళ్లు, పెట్రోలియం ఉత్పత్తుల వినియోగాన్ని ప్రస్తావించారు.
చమురు సంక్షోభాల వేళ పౌరులు వినియోగంతోపాటు ప్రయాణాలు తగ్గించాలని, ఇంధనం పొదుపు చేయాలని దేశ ప్రధానిగా మోడీ చేసిన విజ్ఞప్తి సర్వసాధారణమే. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ప్రపంచాన్ని చమురు సంక్షోభంలోకి నెట్టింది. అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అయ్యాయి.
ఈ క్రమంలో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు పొదుపు చర్యలకు దిగాయి. ఈ దిశలోనే భారత పౌరులను మోడీ అప్రమత్తం చేశారు. చమురు సంక్షోభం నేపథ్యంలో అనేక దేశాలు ఇలాంటి విజ్ఞప్తులతో సరిపెట్టకుండా ఇంధన రేషనింగ్, వర్క్ ఫ్రమ్ హోంను తప్పనిసరి చేయడం సహా అనేక రకాల ఆంక్షలను అమలు చేస్తున్నాయి.
ఇప్పటికే 40కిపైగా దేశాలు ఇంధనం, రవాణాపై చర్యలు చేపట్టాయి. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో ఎక్సైజ్ సుంకాలు తగ్గింపు, ప్రభుత్వ సహాయ చట్రాలు, అధిక ధరలపై హెచ్చరికలు సహా రవాణా, వ్యవసాయం, అధిక మైలేజీ వినియోగదారులకు రంగాలవారీ ఉపశమన చర్యలు తీసుకున్నాయి.
కొన్ని దేశాలు వంట నూనె/ఎల్పీజీ వినియోగం తగ్గింపు దిశగా (రేషనింగ్, సిలిండర్లను సగమే నింపడం లేదా విద్యుత్/పీఎన్‌జీ ప్రత్యామ్నాయాలకు మారడం) ప్రత్యక్ష చర్యలు తీసుకున్నాయి. 18 దేశాలు రవాణా తగ్గింపు వ్యూహాలను అనుసరిస్తున్నాయి. 13 దేశాలు ప్రభుత్వ రంగంలో వర్క్ ఫ్రమ్ హోమ్, రిమోట్ వర్క్ ఏర్పాట్లను ప్రోత్సహించాయి. 35కుపైగా దేశాల్లో ప్రభుత్వ కార్యక్రమాలపై సహా శీతలీకరణ / లైటింగ్ పరిమితులు, ప్రభుత్వ ప్రయాణ నియంత్రణలు, ఇంధన వినియోగ తగ్గింపు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి.
1) వర్క్ ఫ్రమ్ హోమ్:
ప్రయాణ సమయం తగ్గింపు దిశగా అనేక దేశాలు ఇంటి నుంచే పనిచేసేలా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులను ప్రోత్సహిస్తున్నాయి. పాకిస్తాన్, ఇండోనేషియా, శ్రీలంక, కొరియా, కాంబోడియా, మలేషియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, వియత్నాం, పెరూ, ఈజిప్ట్ దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.
2) కూలింగ్ / ఏసీ పరిమితులు:
కొన్ని దేశాలు విద్యుత్ పొదుపు దిశగా కార్యాలయాలు, ప్రభుత్వ భవనాల్లో నిర్దిష్ట ఉష్ణోగ్రత నిర్వహణకు చర్యలు చేపట్టాయి. బంగ్లాదేశ్, కాంబోడియా, మలేషియా, శ్రీలంక దేశాలు గది ఉష్ణోగ్రతలను 25-26 డిగ్రీలకు పరిమితం చేశాయి. జోర్డాన్ దేశం ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీల వాడకాన్ని నిషేధించింది.
3) ప్రయాణంపై ఆంక్షలు:
కొన్ని దేశాలు అధికారిక విమాన / రోడ్డు ప్రయాణాలు సహా అంతర్జాతీయ పర్యటనలపై పరిమితి విధించాయి. కొరియా సరి-బేసి విధానం పాటిస్తుండగా, టాంజానియా సామూహిక ప్రయాణాన్ని ప్రోత్సహిస్తోంది.
4) స్కూళ్లు ఆన్లైన్:
బంగ్లాదేశ్ (విశ్వవిద్యాలయాల మూసివేత), శ్రీలంక (బుధవారం సెలవు), పాకిస్థాన్ (100 శాతం ఆన్లైన్) ఆన్లైన్ విద్యకు మళ్లాయి. అలాగే, విద్యుత్ పొదుపు చర్యలూ చేపట్టాయి.
5) ఇంధన పొదుపు:
సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు, ఎల్ఈడీ రెట్రోఫిట్లు, హీట్ పంప్ గ్రాంట్లు, ఈవీల వినియోగం వైపు ఫ్రాన్స్, యూకే, చిలీ, కంబోడియా, లావో పీడీఆర్, మయన్మార్, థాయిలాండ్ దేశాలు కీలక ఆదేశాలు జారీ చేశాయి.
అలాగే, ఎల్పీజీ సిలిండర్లను సగం నింపడం (మాల్దీవులు, నేపాల్), రాత్రి వేళల్లో మార్కెట్ల మూసివేత, పెద్దపెద్ద వాణిజ్య ప్రకటనల బోర్డుల వద్ద ఉండే లైట్లను ఆపివేయడం (ఈజిప్ట్, శ్రీలంక) వంటి నిబంధనలు అమలు చేస్తున్నాయి.
