Relationship Counseling | పాత ప్రేమలతో కాపురాల్లో చిచ్చు

Relationship Counseling | పాత ప్రేమలతో కాపురాల్లో చిచ్చు

Relationship Counseling | సోషల్ మీడియాతో మళ్లీ దగ్గరవుతున్న పాత స్నేహితులు
హత్యలకు దారితీస్తున్న పాత అనుబంధాలు
యువతకు నిపుణుల కీలక సూచనలు

Relationship Counseling | హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఒకప్పుడు వారంతా కలసి చదువుకున్నారు… ఆడ, మగ కలసిమెలసి తిరిగారు… సన్నిహితంగా మెలిగారు… తరువాత ఉన్నత చదువుల పేరుతో వేరయ్యారు. ఉపాధి కోసం వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. కన్నవారు కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకుని హాయిగా జీవిస్తున్నారు. ఎన్నో ఏళ్ల తరువాత మళ్లీ రీయూనియన్, గెట్ టు గెదర్ పేరుతో పాతమిత్రులు మళ్లీ కలుస్తున్నారు. నాటి సంగతులు నెమరు వేసుకుంటున్నారు. నాడు కలసి తిరిగిన విషయాలను గుర్తు చేసుకుంటున్నారు. అదే వారి కొంప ముంచుతోంది. ఒకప్పుడు కేవలం స్నేహితులుగా ఉన్నవారి మధ్య మళ్లీ ప్రేమలు చిగురిస్తున్నాయి. సోషల్ మీడియా ద్వారా దగ్గరవుతున్నారు. దీంతో అప్పటి వరకు సాఫీగా సాగిన కాపురాల్లో చిచ్చు రేగుతోంది.

ఇటీవల కాలంలో పాత కాలేజ్‌, స్కూల్ స్టూడెంట్స్ నిర్వహిస్తున్న గెట్ టు గెదర్ ఫంక్షన్లు వివాహితుల జీవితాలపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఒకప్పుడు ప్రేమలో ఉన్న వారు, ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకోవడం… ఫోన్ కాల్స్‌, చాటింగ్‌, రహస్య భేటీల వరకు వెళ్లడం కుటుంబాల్లో అనుమానాలకు, గొడవలకు దారితీస్తోంది.

భార్య ప్రియునికి మద్యం తాగించి గొంతు కోసి హత్య

స్కూల్ గెట్ టు గెదర్‌లో కలిసిన మాజీ ప్రియుడితో భార్య టచ్‌లోకి వెళ్లడం చూసిన భర్త అతడిని లోకంలోనే లేకుండా చేశాడు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగిరెడ్డిపల్లికి చెందిన అలేఖ్య, వంశీ స్కూల్లో ఉన్నప్పుడు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత అలేఖ్య నవీన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.

ఇటీవల టెన్త్ క్లాస్ గెట్ టుగెదర్ జరగగా వీరిద్దరి మధ్య పాత ప్రేమ మళ్లీ చిగురించింది. ఇద్దరూ ఒకరితో ఒకరు ఫోన్లో మాట్లాడుకోవడం, కలుసుకోవాలని ప్లాన్స్ వేసుకోవడం అంతా భర్త నవీన్‌కు తెలిసిపోయింది. దీంతో వంశీని ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని పథకం రచించిన భర్త ఏప్రిల్ 30న అతడిని ఇంటికి పిలిచి మందు పార్టీ ఇచ్చాడు.

ఫుల్లుగా మద్యం తాగిన తర్వాత తన స్నేహితుడు భాస్కర్ సహాయంతో కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం అతడిని ఎవరూ గుర్తుపట్టకుండా మృతదేహాన్ని కవర్లో చుట్టి, కారు డిక్కీలో వేసుకుని మంథని సమీపంలోని గాడుదుల గండి లోయలో పడేశారు. మొదట వంశీ కనిపించకపోవడంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరిపి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులైన నవీన్‌, భాస్కర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు అలేఖ్యను సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

కన్న పిల్లలనే హతమార్చిన ఓ తల్లి

అమీన్‌పూర్‌లో ఓ తల్లి ముగ్గురు చిన్నారులకు విషం పెట్టి హతమార్చిన దారుణ ఘటన గతేడాది రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. లోతుగా దర్యాప్తు చేయగా గెట్ టు గెదర్‌లో కలిసిన మాజీ ప్రియుడితో వెళ్లేందుకే తల్లి ఈ దారుణానికి పాల్పడినట్టు తేలింది.

పదవ తరగతి గెట్ టు గెదర్ పార్టీలో రజితకు తన క్లాస్‌మేట్ అయిన శివతో పరిచయం మరింతగా పెరగడంతో నెంబర్లు మార్చుకుని మాట్లాడుకున్నారు. చాలా సార్లు శారీరకంగా కలిశారు. భర్తతో ఏజ్ గ్యాప్ ఉండటం, ప్రియుడి మోజులో బాగా మునిగి తేలిన రజితకు భర్త, పిల్లలపై ప్రేమ పూర్తిగా తగ్గిపోయింది.

శివకు ఇంకా పెళ్లి కాకపోవడంతో, ఎలాగైనా అతన్ని పెళ్లి చేసుకొని జీవితాంతం సుఖంగా ఉండాలని రజిత భావించింది. భర్త, పిల్లల అడ్డు తొలగించుకుని ప్రియుడితో సుఖంగా ఉండాలని స్కెచ్ వేసింది. 2025 మార్చి 27న రజిత పెరుగులో విషం కలిపిన అన్నం పిల్లలకు పెట్టి హత్య చేసింది. పోలీసులు దర్యాప్తు చేసి రజిత చేసిన దారుణాన్ని బయటపెట్టారు.

గెట్ టు గెదర్ తర్వాత పెరుగుతున్న కుటుంబ కలహాలు

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్లు పాత స్నేహితులను మళ్లీ కలుపుతున్నాయి. మొదట “ఎలా ఉన్నావ్?”, “గుర్తుందా?” అంటూ మొదలయ్యే సంభాషణలు… క్రమంగా వ్యక్తిగత చర్చలకు, ఎమోషనల్ రిలేషన్లకు దారితీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఇప్పటికే పెళ్లైన వ్యక్తులు పాత ప్రేమను తిరిగి గుర్తు చేసుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతోందని కుటుంబ సలహాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో గెట్ టు గెదర్ ఫంక్షన్లకు వెళ్లిన తర్వాత ఇంట్లో గొడవలు మొదలవుతున్నాయని సమాచారం.

భార్య లేదా భర్త ఫోన్‌లో ఎక్కువ సమయం గడపడం, రహస్యంగా చాటింగ్ చేయడం, తరచూ బయటకు వెళ్లడం వంటి అంశాలు అనుమానాలకు తావిస్తున్నాయి. కొన్ని కుటుంబాల్లో ఈ పరిణామాలు విడాకుల వరకు వెళ్లిన ఘటనలూ ఉన్నాయని కౌన్సిలర్లు చెబుతున్నారు.

యువతకు నిపుణుల సూచనలు

పాత స్నేహాలు కొనసాగించడం తప్పుకాదనీ… కానీ వాటి వల్ల ప్రస్తుత కుటుంబ బంధాలు దెబ్బతినకూడదని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. భార్యాభర్తల మధ్య పారదర్శకత, పరస్పర నమ్మకం ఉంటే ఇలాంటి సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు.

ఒకప్పుడు కేవలం జ్ఞాపకాలుగా మిగిలిపోయిన పాత ప్రేమలు… ఇప్పుడు సోషల్ మీడియా కారణంగా మళ్లీ జీవం పొందుతున్నాయి. అయితే ఆ పాత అనుబంధాలు కొత్త జీవితాలను కుదేలు చేయకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Leave a Reply