ధాన్యం కొనుగోళ్ళు వేగవంతం చేయాలి

ధాన్యం కొనుగోళ్ళు వేగవంతం చేయాలి
మండలాల అభివృద్ధికి సహకరించాలి
కలెక్టర్ ను కోరిన ఝాన్సీ రెడ్డి
తొర్రూరు, ఆంధ్రప్రభ : వరి, మొక్కజొన్నల కొనుగోలు వేగవంతం చేయాలని టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి కోరారు.జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ను తొర్రూరు, పెద్ద వంగర మండల కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఝాన్సీ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందించి,శాలువాతో సత్కరించారు.తొర్రూరు, పెద్ద వంగర మండలాల్లో ధాన్యం కొనుగోళ్లలో తలెత్తుతున్న సమస్యలను ఝాన్సీ రెడ్డి కలెక్టర్ కు వివరించారు.లారీలు వచ్చేలా, గన్ని సంచుల కొరత తీర్చేలా చూడాలని కోరారు.
పంట కొనుగోలు అనంతరం రైతుల ఖాతాల్లో వెంటనే డబ్బులు జమ చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు.కొనుగోలు ప్రక్రియ, పారదర్శకంగా వేగవంతంగా జరగాలని తెలిపారు.కలెక్టర్ మాట్లాడుతూ…ధాన్యం కొనుగోలు వేగవంతం చేశామని, చివరి గింజ వరకు ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తామని, దానికి ప్రజలు సహకరించాలని కోరారు. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతోందని, వాటిని విజయవంతంగా ప్రజలకు చేరవేయడంలో సమన్వయంతో పనిచేయాలని కోరారు.
ప్రజలు అధికారులు సమన్వయంతో పనిచేయడం ద్వారా జిల్లాను అగ్రస్థానంలో నిలిపేలా అడుగులు వేద్దామన్నారు. కలెక్టర్ ను కలిసిన వారిలో తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్, వైస్ చైర్మన్ సోమ రజిని రాజశేఖర్, జిల్లా నాయకులు గంజి విజయపాల్ రెడ్డి, కౌన్సిలర్ ముద్దసాని సురేష్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, మహిళా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు పింగిలి ఉష, నాయకులు చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి, మంగళపల్లి రామచంద్రయ్య, చెవిటి సుధాకర్, రవీంద్ర చారి, తాళ్లపల్లి రమేష్ గౌడ్, పంజా కల్పన, ప్రవీణ్ యాదవ్, మహేష్ యాదవ్, హరికృష్ణ, గిరిధర్, ఎర్రం రాజు రైతులు పాల్గొన్నారు.
