కేడీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో చలివేంద్రం..
కేడీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో చలివేంద్రం..
ఎండల వేళ ప్రజలకు చల్లని నీరు, మజ్జిగ పంపిణీ..
జిల్లా రిజిస్ట్రార్ చేతుల మీదుగా సేవా కార్యక్రమం ప్రారంభం
పెద్ద ఎత్తున పాల్గొన్న బ్యాంకు సిబ్బంది, సంఘాల ప్రతినిధులు..
(తిరువూరు, ఆంధ్రప్రభ )
సీఎం చంద్రబాబు నాయుడు సుపరిపాలన స్ఫూర్తితో, ప్రజాసేవ లక్ష్యంగా కృష్ణా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ఆధ్వర్యంలో తిరువూరు శాఖ పరిధిలో మంగళవారం చలివేంద్రం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ సేవా కార్యక్రమంలో ప్రజలకు చల్లని తాగునీరు, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా రిజిస్ట్రార్ కిరణ్ కుమార్ ప్రారంభించారు. మండుతున్న ఎండల్లో ప్రయాణికులు, స్థానిక ప్రజలకు స్వయంగా చల్లని నీరు, మజ్జిగ అందజేసి సేవా కార్యక్రమాన్ని ప్రారంభించడం విశేషంగా నిలిచింది. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రజల దాహార్తి తీర్చేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానికుల నుంచి మంచి స్పందన లభించింది. సామాజిక బాధ్యతలో భాగంగా కేడీసీసీ బ్యాంకు చేపట్టిన ఈ కార్యక్రమంపై ప్రజలు ప్రశంసలు వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో తిరువూరు శాఖ ప్రధాన నిర్వాహకురాలు తాళ్లూరి ఉషాజ్యోతి , సహాయ నిర్వాహకుడు అరుణ్ , శాఖ పరిధిలోని 38 సహకార సంఘాల సీఈఓలు, బ్యాంకు సిబ్బంది, స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
