120dollars | ప్రధాని మోదీ ఏడు సూత్రాలు

120dollars | ప్రధాని మోదీ ఏడు సూత్రాలు
120dollars | దేశ భవిష్యత్‌కు దీర్ఘకాలిక వ్యూహం
రాజకీయం కాదంటున్న ఎనలిస్టులు
స్వదేశీ ఉత్పత్తుల వినియోగం పెరగాలి
వంట నూనెల వినియోగం తగ్గాలి
సహజసిద్ధ వ్యవసాయానికి ప్రాధాన్యం
ఇవన్నీ అవసరమైన ముందస్తు చర్యలే
ప్రధాని వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్న ఆర్థికవేత్తలు
120dollars | సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ : ప్రపంచం మరోసారి యుద్ధ జ్వాలల్లో చిక్కుకుంది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న అనిశ్చితి వల్ల గ్లోబల్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 120 డాలర్ల మార్కును దాటి దూసుకుపోతున్నాయి. ఇటువంటి అసాధారణ పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పకూలకుండా కాపాడుకోవడానికి ప్రధాని మోదీ పౌరుల ముందు ఉంచిన ఏడు సూచనలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వీటిని కేవలం సలహాలుగా కాకుండా, దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక గండం నుంచి గట్టెక్కించే జాతీయ మిషన్‌గా చూడాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
సంక్షోభ సమయంలోనే ఎందుకు?
సాధారణ పరిస్థితుల్లో ఏ ప్రభుత్వమూ ప్రజల వ్యక్తిగత అలవాట్లలో జోక్యం చేసుకోదు. కానీ, నేడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. భారతదేశం తన చమురు అవసరాల్లో 80% పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. యుద్ధం వల్ల సరఫరా ఆగితే లేదా ధరలు భారీగా పెరిగితే విదేశీ మారక ద్రవ్యం కరిగిపోతుంది. ఇది రూపాయి విలువ పతనానికి, దేశంలో ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. అందుకే, పరిస్థితి చేయి దాటక ముందే ప్రధాని అప్రమత్తం చేశారు. గతంలోనూ కోవిడ్ సమయంలో ఇలాంటి కఠిన నిర్ణయాల వల్లే భారత్ ఆర్థికంగా నిలదొక్కుకోగలిగింది.
పొదుపు మంత్రం.. దేశానికి రక్షాకవచం
ప్రధాని సూచించిన బంగారు కొనుగోళ్ల వాయిదా, వంట నూనెల పొదుపు వంటివి నేరుగా విదేశీ మారక ద్రవ్య నిల్వలతో ముడిపడి ఉన్నాయి. భారతీయులు బంగారం కోసం వెచ్చించే వేల కోట్లు విదేశాలకు వెళ్తుంటాయి. అలాగే, చమురు వాడకాన్ని తగ్గించేందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ , ప్రజా రవాణా వాడకాన్ని ప్రోత్సహించడం అనేది దేశీయ డిమాండ్‌ను తగ్గించి, దిగుమతి భారాన్ని తగ్గించే వ్యూహం. ఇది వ్యక్తిగత పొదుపు మాత్రమే కాదు, దేశ ఖజానాకు ఇచ్చే ఊతం. రసాయన ఎరువుల దిగుమతిపై భారత్ ఏటా లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది. పశ్చిమ ఆసియా సంక్షోభం వల్ల ఎరువుల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. ఈ క్రమంలో సహజ సిద్ధమైన వ్యవసాయం, స్వదేశీ ఉత్పత్తుల వాడకం పై ప్రధాని పిలుపునివ్వడం వెనుక దీర్ఘకాలిక వ్యూహం ఉంది. మనం ఎంత త్వరగా స్వయం సమృద్ధి సాధిస్తే, అంత త్వరగా అంతర్జాతీయ మార్కెట్ల ఒడిదుడుకుల నుండి రక్షణ పొందవచ్చు. ఇది కేవలం రైతులకో, మధ్యతరగతి వర్గాలకో సంబంధించిన అంశం కాదు.. దేశ ఆర్థిక సార్వభౌమత్వానికి సంబంధించిన విషయం.
నియంత్రణ అంటే వెనకడుగు కాదు!
విదేశీ పర్యటనల నియంత్రణ వంటి సూచనలు కొన్ని వర్గాల్లో చర్చకు దారితీయవచ్చు. అయితే, దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు వనరులను పొదుపుగా వాడుకోవడమే దేశభక్తి. ప్రధాని మోదీ ఎప్పుడూ లేని విధంగా ఇటువంటి విన్నపాలు చేస్తున్నారంటే, పరిస్థితులు ఎంత గంభీరంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. విమర్శకులు దీనిని రాజకీయ కోణంలో చూసినా, ఆర్థిక వేత్తలు మాత్రం ఇది ఖచ్చితంగా అవసరమైన ముందస్తు చర్య అని అభివర్ణిస్తున్నారు. ఏ దేశమైనా బలమైన ఆర్థిక వ్యవస్థతోనే ప్రపంచ వేదికపై గంభీరంగా నిలబడగలదు. యుద్ధం మన గడపలో లేదు కదా అని మనం నిశ్చింతగా ఉంటే, అకస్మాత్తుగా వచ్చే ధరల పెరుగుదల మన సామాన్యుడి పళ్లాన్ని ఖాళీ చేస్తుంది. ప్రధాని మోదీ చెప్పిన ఏడు సూత్రాలను పాటించడం అంటే, మన ఇంటిని మనం కాపాడుకోవడమే కాదు, దేశ ఆర్థిక కోటను పటిష్టం చేయడమే. ఇప్పుడు కావాల్సింది విమర్శలు కాదు.. సామూహిక బాధ్యత.
CLICK HERE TO READ Vijay in2days | మొదటి దెబ్బ వైన్ షాపులపైనే..
