23 నెలల్లో సంక్షేమం…
23 నెలల్లో సంక్షేమం…
అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం చరిత్ర సృష్టించింది…
ఎన్నికల హామీల అమలులో సీఎం చంద్రబాబు ప్రభుత్వం ముందంజ..
కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ..
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 23 నెలలు పూర్తవుతున్న సందర్భంగా సంక్షేమం, అభివృద్ధి, పారదర్శక పాలనలో ప్రభుత్వం చారిత్రాత్మక విజయాలు సాధించిందని కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ పేర్కొన్నారు. మంగళవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుందని తెలిపారు.

“తల్లికి వందనం” పథకం ద్వారా లక్షలాది విద్యార్థులకు ఆర్థిక సాయం అందించడంతో పాటు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గిందన్నారు. “దీపం-2” పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు భోజన సౌకర్యం కల్పించడం ప్రజలకు ఎంతో ఉపశమనంగా మారిందని పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, “అన్నదాత సుఖీభవ” పథకం ద్వారా కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు.

సాగునీటి ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించి చెరువుల పునరుద్ధరణ, కాలువల మరమ్మతులు చేపడుతున్నారని చెప్పారు. రాయలసీమ ప్రాంతానికి నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఉద్యోగాల భర్తీలో భాగంగా మెగా డీఎస్సీ, కానిస్టేబుల్ నియామకాలు చేపట్టడం యువతకు ఊరటనిచ్చిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బకాయిల చెల్లింపులు కూడా పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అమరావతిని శాశ్వత రాజధానిగా అభివృద్ధి చేస్తూ రాష్ట్రాన్ని పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారని గుడిసె కృష్ణమ్మ పేర్కొన్నారు. భారీ పరిశ్రమలు, ఐటీ సంస్థలు రాష్ట్రానికి రావడం ద్వారా లక్షలాది ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయని తెలిపారు. పేదలు, మహిళలు, రైతులు, యువత, కార్మికులు సహా అన్ని వర్గాల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోందని ఆమె అన్నారు. పాత్రికేయుల సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
