Small Temples Telangana | చిన్న ఆలయాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం

Small Temples Telangana | చిన్న ఆలయాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం

Small Temples Telangana | హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాలు అభివృద్ధి దిశగా దూసుకెళ్తుండగా.. వేలాది చిన్న ఆలయాలు మాత్రం ఆర్థిక ఇబ్బందులు, సిబ్బంది కొరత, నిర్వహణ లోపాలతో శిథిలావస్థలో కొనసాగుతున్నాయి. గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలైన ఈ ఆలయాలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

చాలా వరకు గ్రామాల్లో పురాతన ఆలయాలను దేవాదాయశాఖ గుర్తించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని చోట్ల గుర్తించినప్పటికీ, వాటికి పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాల కోసం కార్యాచరణ చేపట్టడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో ఉన్న అనేక దేవాలయాలు రోజువారీ పూజా కార్యక్రమాలు నిర్వహించడానికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయ శాఖ పరిధిలో 12 వేలకు పైగా ఆలయాలున్నట్లు అంచనా. వీటిలో చాలా చిన్న ఆలయాలు సరైన ఆదాయం లేక కాలక్రమేణా పాడైపోతున్నాయి. మరోవైపు యాదాద్రి, వేములవాడ, భద్రాచలం, బాసర, కొండగట్టు వంటి ప్రధాన ఆలయాలు మాత్రం భారీ ఆదాయం, ప్రత్యేక ప్రణాళికలతో అభివృద్ధి చెందుతున్నాయి.

ప్రభుత్వ నిధులు, ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికలు, సిబ్బంది నియామకాలు, మౌలిక వసతుల కల్పనతో ఈ దేవాలయాలు ఆధునీకరణ దిశగా సాగుతున్నాయి. అయితే, గ్రామాల్లోని చిన్న దేవాలయాలకు మాత్రం ఇలాంటి అవకాశాలు అందడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన ఆలయాలకు ట్రస్ట్ బోర్డులు, ఎగ్జిక్యూటివ్ అధికారులు, భారీ బడ్జెట్లు లభిస్తుండగా, చిన్న ఆలయాలు మాత్రం స్థానిక భక్తుల సహకారంపైనే కొనసాగుతున్నాయి. దీంతో అనేక చారిత్రక దేవాలయాలు గుర్తింపు లేకుండా మిగిలిపోతున్నాయి.

చిన్న ఆలయాల్లో హుండీ ఆదాయం అత్యల్పంగా ఉండటంతో నిత్యనైవేద్యం, పూజా సామగ్రి, విద్యుత్ బిల్లులు వంటి ఖర్చులు కూడా భక్తుల విరాళాలపైనే ఆధారపడుతున్నాయి. కొన్నిచోట్ల నెలకు వచ్చే ఆదాయం కొన్ని వేల రూపాయలకే పరిమితమవుతోంది. కామన్ గుడ్ ఫండ్ ద్వారా అందాల్సిన సాయం కూడా అన్ని చోట్ల చేరడం లేదని విమర్శలు ఉన్నాయి.

కాగా, అనేక ఆలయాల్లో శాశ్వత అర్చకులు లేరు. ఒక్క అర్చకుడే పలు చోట్ల పూజలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. తక్కువ వేతనాలు, గౌరవ వేతనాల ఆలస్యం కారణంగా యువత ఈ వృత్తి వైపు ఆసక్తి చూపడం తగ్గినట్లు తెలుస్తోంది.

మరమ్మతులు కరువు

పురాతన ఆలయాలు మరమ్మతులు లేక పాడైపోతున్నాయి. గోడలు చిట్లిపోవడం, పైకప్పు నుంచి నీళ్లు లీక్ అవడం, ప్రహరీ గోడలు లేకపోవడం వంటి సమస్యలున్నాయి. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండటం, పాములు, చెట్లు పెరగడంతో భక్తులు వెళ్లేందుకు కూడా వెనుకాడే పరిస్థితి ఏర్పడుతోంది. ఇలాంటి ఆలయాలను పునరుద్ధరించి దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకురావాలని ప్రజలు, భక్తులు కోరుతున్నారు.

కొన్ని ఆలయాల్లో స్వామివారి ఆభరణాలు, వెండి వస్తువులు, పూజా పాత్రలు ఉన్నప్పటికీ సరైన భద్రతా వ్యవస్థలు లేవు. సీసీ కెమెరాలు, భద్రతా వ్యవస్థలు లేకపోవడంతో దొంగతనాల భయం కూడా నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో విగ్రహాల ధ్వంసం ఘటనలు భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

చిన్న దేవాలయాలకు చెందిన ఇనాం భూములు అనేక చోట్ల ఆక్రమణలకు గురవుతున్నాయి. సరైన రికార్డులు లేకపోవడం వల్ల ఆదాయం ఆగిపోతున్నదని అధికారులు చెబుతున్నారు. భూములు తిరిగి స్వాధీనం చేసుకుంటే ఆలయాలకు స్థిర ఆదాయం లభించే అవకాశం ఉంది.

చిన్న ఆలయాలకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలి

చిన్న ఆలయాలకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని, అర్చకులకు గౌరవ వేతనాలు పెంచాలని, ఆలయ భూములను రక్షించాలని భక్తులు కోరుతున్నారు. ప్రతి మండలంలో చిన్న ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని వారు సూచిస్తున్నారు. తెలంగాణలో చిన్న ఆలయాలు కేవలం పూజా స్థలాలే కాకుండా గ్రామీణ సంస్కృతి కేంద్రాలుగా నిలిచాయి. వాటి పరిరక్షణకు ప్రభుత్వం, దాతలు, స్థానిక సమాజం కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆధ్యాత్మికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply