35 days : ఒకనెల ఎక్కువ.. మరోనెల తక్కువ..

35 days : ఒకనెల ఎక్కువ.. మరోనెల తక్కువ..

35 days : నిర్లక్ష్యం చేస్తే వచ్చే ఇబ్బందులు..

“ఈ నెల పీరియడ్ ఇంకా రాలేదు”
“రెండు నెలల నుంచి సరిగా రావడం లేదు…”
“ఒకసారి ఎక్కువగా, మరోసారి చాలా తక్కువగా అవుతోంది…”

35 days : వెబ్‌డెస్క్, ఆంధ్ర‌ప్ర‌భ : ఇది చాలా మంది మహిళలను సాధారణంగా వేధించే సమస్య. కానీ చాలా మంది ఈ సమస్యను చిన్న విషయంగా తీసుకుని నిర్లక్ష్యం చేస్తుంటారు. “స్ట్రెస్ వల్లే అయి ఉంటుంది”, “హార్మోన్లు మారుతుంటాయి” అంటూ వదిలేస్తారు. “వచ్చేసారికి కరెక్ట్ గా వస్తుందిలే” “నేను కరెక్ట్ గా గుర్తు పెట్టుకోలేదేమో” ఇలా అనుకుని సరిపెట్టుకుంటూంటారు. సక్రమంగా లేని ఋతుచక్రం కొన్ని సార్లు శరీరం ఇచ్చే ముఖ్యమైన అనారోగ్య హెచ్చరికకు సంకేతం కూడా కావచ్చు అనేది వైద్య నిపుణుల సూచన.

సాధారణంగా మహిళల్లో 21 నుంచి 35 రోజుల మధ్య వచ్చే పీరియడ్స్‌ను సాధారణ ఋతుచక్రంగా భావిస్తారు. కానీ తరచూ ఆలస్యం కావడం, చాలా త్వరగా రావడం, అధిక రక్తస్రావం, తీవ్రమైన నొప్పి, నెలల తరబడి రాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు.

ఇప్పటి జీవనశైలిలో మార్పులు ఇందుకు ప్రధాన కారణాల్లో ఒకటి. రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోవడం, పని ఒత్తిడి, ఫాస్ట్ ఫుడ్ అలవాట్లు, బరువు పెరగడం లేదా ఒక్కసారిగా తగ్గిపోవడం, వ్యాయామం లేకపోవడం ఇవన్నీ హార్మోన్ల సమతౌల్యాన్ని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా యువతుల్లో “పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్” (పీసీఓఎస్) సమస్య వేగంగా పెరుగుతోందని గైనకాలజిస్టులు చెబుతున్నారు. దీనివల్ల ఋతుచక్రం అసమతౌల్యంగా మారడమే కాకుండా, గర్భధారణ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

ఇక థైరాయిడ్ సమస్యలు, రక్తహీనత, మధుమేహం, మానసిక ఒత్తిడి కూడా పీరియడ్స్‌పై ప్రభావం చూపుతాయి. కొందరిలో అధిక రక్తస్రావం వల్ల శరీరంలో ఐరన్ తగ్గి అలసట, బలహీనత పెరుగుతుంది. మరికొందరిలో హార్మోన్ల అసమతౌల్యం కారణంగా మొటిమలు, జుట్టు రాలడం, ఊబకాయం వంటి సమస్యలు కనిపిస్తాయి.

ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రతి ఇన్ బ్యాలెన్స్ పీరియడ్స్ ఏదో ఒక పెద్ద వ్యాధికే సంకేతం కాకపోవచ్చు. కానీ అది తరచూ కొనసాగితే మాత్రం వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. చాలా మంది సిగ్గు, భయం లేదా నిర్లక్ష్యంతో వైద్యులను సంప్రదించడానికి ఆలస్యం చేస్తారు. ఫలితంగా చిన్న సమస్య పెద్దదిగా మారే ప్రమాదం ఉంటుంది.

నిపుణుల సూచనల ప్రకారం, సమతుల్య ఆహారం, సరిపడ నిద్ర, క్రమం తప్పని వ్యాయామం, ఒత్తిడిని తగ్గించే జీవన శైలి పాటిస్తే ఋతు చక్ర సమస్యలను చాలా వరకు నియంత్రించవచ్చు. అలాగే పీరియడ్స్ తేదీలను ట్రాక్ చేయడం కూడా ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది.

మహిళల ఆరోగ్యం విషయంలో ఋతుచక్రం ఒక సహజ ప్రక్రియ మాత్రమే కాదు… శారీరక-మానసిక ఆరోగ్యానికి అద్దంలాంటిది కూడా. అందుకే సక్రమంగా లేని ఋతుచక్రాన్ని “సాధారణమే” అని తీసిపారేయకుండా, సమయానికి జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం.