Ceasefire | సీజ్‌ఫైర్‌కు.. తూట్లు

Ceasefire | సీజ్‌ఫైర్‌కు.. తూట్లు

Ceasefire | హ‌ర్మూజ్‌లో మ‌ళ్లీ క్షిప‌ణుల మోత‌
జలసంధి వేదికగా డ్రోన్‌ల‌తో ప‌ర‌స్ప‌ర‌ దాడులు
ఇరాన్,అమెరికా మ‌ధ్య ల‌వ్ ట్యాప్ అన్న ట్రంప్
అప్ర‌మ‌త్త‌మైన గ‌ల్ఫ్ దేశాలు
యాంటీ ఎయిర్ క్రాప్ట్ సిస్ట‌మ్ యాక్టీవ్ చేసిన యూఏఈ

Ceasefire | సెంట్ర‌ల్ డెస్క‌, ఆంధ్ర‌ప్ర‌భ : అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య హ‌ర్మూజ్‌ జలసంధి వేదికగా మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. గత నెల రోజులుగా కొనసాగుతున్న సీజ్‌ఫైర్ (కాల్పుల విరమణ) ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ఇరు దేశాలు పరస్పరం దాడులకు దిగడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఒకవైపు క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతూనే, మరోవైపు ఇది కేవలం ప్రేమపూర్వక హెచ్చరిక (లవ్ ట్యాప్) మాత్రమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం.

హ‌ర్మూజ్‌ జలసంధిలో ఏం జరిగింది?
అమెరికా, ఇరాన్ మధ్య కొంతకాలంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా హ‌ర్మూజ్‌ జలసంధిలో ఇరాన్ సైన్యం అమెరికాకు చెందిన మూడు యుద్ధ నౌకలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లు, చిన్నపాటి నౌకలతో దాడికి దిగింది. ఇరాన్ దాడుల వల్ల అమెరికా నౌకలకు భారీ నష్టం వాటిల్లిందని ఇరాన్ మీడియా ప్రచారం చేసింది. అయితే, అమెరికా సెంట్రల్ కమాండ్ ఈ వార్తలను ఖండించింది. తమ నౌకలన్నీ సురక్షితంగా ఉన్నాయని, ఆత్మరక్షణ కోసం తాము ఇరాన్ భూభాగంలోని మిసైల్ లాంచ్ సైట్లు, డ్రోన్ కేంద్రాలపై ప్రతీకార దాడులు చేశామని వెల్లడించింది.

ట్రంప్ లవ్ ట్యాప్ వ్యాఖ్యల కలకలం
ఈ దాడుల అనంతరం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వింత వ్యాఖ్యలు చేశారు. ఈ ఘర్షణను ఆయన లవ్ ట్యాప్ (ప్రేమతో ఇచ్చిన చిన్న దెబ్బ) అని అభివర్ణించారు. సీజ్‌ఫైర్ ఒప్పందం ఇంకా అమలులోనే ఉందని, పరిస్థితి అంత తీవ్రంగా ఏమీ లేదని ఆయన చెప్పుకొచ్చారు. అయితే, ఇరాన్ తక్షణమే శాంతి ఒప్పందానికి అంగీకరించాలని, లేని పక్షంలో తమ తదుపరి చర్యలు చాలా కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. గతంలో ఇలాంటి ఘర్షణలనే ఆయన మినీ వార్ అని కూడా పేర్కొన్నారు.

ఇరాన్ భూభాగంలో దాడుల తీవ్రత
అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్ తూర్పు తీరంలోని కేష్మ్ ఐలాండ్, బందర్ ఖమీర్, సిరిక్ ప్రాంతాల్లోని సైనిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. తమ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తే తక్షణమే రెట్టింపు శక్తితో సమాధానం చెబుతామని ఇరాన్ సైన్యం హెచ్చరించింది. దాదాపు గంటల పాటు సాగిన ఈ కాల్పుల తర్వాత ప్రస్తుతానికి హ‌ర్మూజ్ జలసంధి వద్ద పరిస్థితులు కాస్త సద్దుమణిగాయని ఇరాన్ ప్రభుత్వ ఛానెల్ ప్రెస్ టీవీ వెల్లడించింది.

శాంతి ఒప్పందంపై సందిగ్ధత ప్రస్తుతం అమెరికా పంపిన కొత్త శాంతి ప్రతిపాదనపై ఇరాన్ స్పందన కోసం ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయి. ఈ ప్రతిపాదనలో యుద్ధానికి స్వస్తి పలకాలని ఉన్నప్పటికీ, ఇరాన్ అణు కార్యక్రమం, హ‌ర్మూజ్ జలసంధిని అంతర్జాతీయ రవాణా కోసం పూర్తిగా తెరిచి ఉంచడం వంటి కీలక అంశాలపై ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. ఒకవైపు చర్చలంటూనే, మరోవైపు క్షిపణులతో దాడులు చేసుకోవడం చూస్తుంటే పశ్చిమ ఆసియాలో శాంతి అనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇక ఈ దాడుల‌తో గ‌ల్ఫ్ దేశాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి.. యూఏఈ త‌న యాంటీ ఎయిర్ క్రాప్ట్ సిస్టమ్ ను ఆన్ చేసింది.. పౌరులంద‌రూ సుర‌క్షిత ప్రాంతాల‌లో ఉండాల‌ని హెచ్చరిక‌లు జారీ చేసింది.

CLICK HERE TO READ జొన్న రైతుకు.. మ‌ద్ద‌తేదీ?

CLICK HERE TO READ MORE