బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై దాడి శోచనీయం

వికారాబాద్, ఆంధ్రప్రభ : కరీంనగర్‌లోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కుట్రలో భాగమని వికారాబాద్ మండల నాయకుడు పడి గల అశోక్ ఆరోపించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పడం, డ్రగ్స్, గంజాయి విచ్చలవిడిగా విస్తరిస్తున్న అంశాలపై దృష్టి పెట్టాల్సిందిపోయి ప్రతిపక్ష పార్టీలపై దాడులు చేయడం తగదని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఇద్దరూ తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను పక్కదారి పట్టించేందుకు బీఆర్‌ఎస్ పార్టీ సభలకు పోటీగా సీఎం రేవంత్ రెడ్డి సభలు నిర్వహిస్తూ మీడియా దృష్టి మళ్లించే రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణకు కేంద్ర నిధులు, ఐఐటీ, ఎయిమ్స్, మెడికల్ కళాశాలలు తీసుకురావాలని సూచించారు. కానీ కరీంనగర్‌లో చిల్లర రాజకీయాలు, రౌడీ రాజకీయాలకు పాల్పడటం సరికాదన్నారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెరచాటు రాజకీయాలు చేస్తున్నాయని, రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు వాటికి తగిన గుణపాఠం చెబుతారని పడి గల అశోక్ పేర్కొన్నారు.