జనగణనపై ప్రజల్లో చైతన్యం
జనగణనపై ప్రజల్లో చైతన్యం
- ప్రతి కుటుంబం వివరాలు నమోదు చేయాలి
- జనగణనపై ఘనంగా అవగాహన ర్యాలీ
- అదనపు కలెక్టర్ అమరేందర్
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ ; నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జనగణనపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు శుక్రవారం నాగర్ కర్నూల్ పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం నుండి ఘనంగా జనగణన ప్రాముఖ్యతను ప్రజలకు తెలియపరిచేలా అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా ముఖ్య ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో వివిధ శాఖల అధికారులు, ఉద్యోగస్తులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ర్యాలీని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ అమరేందర్, జిల్లా అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలోని క్రీడా మైదానం నుండి అంబేద్కర్ చౌరస్తా శ్రీపురం కూడలి రోడ్డు ప్రధాన వీధుల మీదుగా సాగిన ర్యాలీలో పాల్గొని జనగణన ప్రాముఖ్యతను వివరిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ అమరేందర్ మాట్లాడుతూ…., జనగణన దేశ అభివృద్ధికి పునాది వంటిదని తెలిపారు.
ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే జనగణన ద్వారా దేశ జనాభా, జీవన పరిస్థితులు, విద్య, ఉపాధి, గృహ వసతులు, సామాజిక పరిస్థితులపై సమగ్ర సమాచారం సేకరించబడుతుందని తెలిపారు. ఈ గణాంకాల ఆధారంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తాయని చెప్పారు. ప్రతి కుటుంబం తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయించడం ఎంతో అవసరమని ఆయన అన్నారు. ప్రజలు ఎటువంటి అపోహలకు లోనుకాకుండా జనగణన సిబ్బందికి పూర్తి సహకారం అందించాలని కోరారు.

సేకరించిన సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుందని, అది కేవలం ప్రభుత్వ ప్రణాళికల రూపకల్పన కోసమే ఉపయోగించబడుతుందని స్పష్టం చేశారు. జనగణన ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల అవసరాలను సరిగా అంచనా వేసి విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు, గృహనిర్మాణం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అందువల్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి జనగణన విజయవంతానికి సహకరించాలని పిలుపునిచ్చారు.
ర్యాలీ అనంతరం విద్యార్థులు జనగణన ప్రాముఖ్యతపై ప్లకార్డులు ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారిని సుజాత, డిఇఓ రమేష్ కుమార్ రెవెన్యూ అధికారులు, డీఎంహెచ్వో రవి నాయక్, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, మున్సిపల్ సిబ్బంది, ఆశ వర్కర్, ఉపాధ్యాయులు, వివిధ శాఖల అధికారులు ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు.
