బక్రీద్ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలి..

బక్రీద్ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలి..

  • మెదక్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస రావు

మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : మెదక్ జిల్లాలో బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో మతసామరస్యాన్ని కాపాడేలా నిర్వహించాలని, పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందని మెదక్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు సూచించారు. గురువారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఖురేషి కులస్తులు, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూ వాహిని, శ్రీరామ్ సేన, హిందూ యువవాహిని సభ్యులతో వేర్వేరుగా అవగాహన సమావేశాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సరైన అధికారిక అనుమతులు, పత్రాలు ఉన్న పశువులను మాత్రమే సంహరించాలని ఖురేషి కులస్తులకు సూచించారు. ఆవులను ఎట్టి పరిస్థితుల్లోనూ సంహరించవద్దని స్పష్టం చేశారు. పశువుల కొనుగోలు సమయంలో సంబంధిత పత్రాలు తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. మాంసం నిల్వ చేసే ప్రదేశాల్లో పరిశుభ్రత పాటించాలని, పక్షులు, కుక్కలు, కోతుల వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆవులు, దూడల అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, వ్యక్తులపై దాడులకు పాల్పడడం నేరమని హెచ్చరించారు.

అక్రమంగా పశువులను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి రాత్రింబవళ్లు వాహనాల తనిఖీలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తూ అనుమానాస్పద వాహనాలపై నిఘా ఉంచుతున్నామని చెప్పారు. పశువుల అక్రమ రవాణా శిక్షార్హమైన నేరమని, మూగజీవాలపై క్రూరత్వానికి దారితీస్తుందని తెలిపారు. ప్రభుత్వం, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పశువుల రవాణా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్ యాక్ట్‌, కౌ స్లాటర్ యాక్ట్‌, భారతీయ న్యాయ సంహిత చట్టాల కింద కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. గోరక్షణ పేరుతో దాడులు, వాహనాల ధ్వంసం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, వాస్తవాలు నిర్ధారించకుండా వాటిని షేర్ చేయవద్దని ప్రజలకు సూచించారు. పశువుల అక్రమ రవాణాపై సమాచారం తెలిసిన వెంటనే డయల్‌ 100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెదక్ డిఎస్పీ ప్రసన్న కుమార్, సీఐలు జర్జ్, సందీప్ రెడ్డి, వెటర్నరీ డాక్టర్ లక్ష్మణ్, పోలీస్ సిబ్బంది, మత పెద్దలు, పాల్గొన్నారు.