ఉచిత మట్టి పరీక్షల పై రైతులకు అవగాహన

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : వ్యవసాయంలో శాస్త్రీయ పద్ధతులను ప్రోత్సహిస్తూ రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో డా. రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి పరీక్షల కార్యక్రమం కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ మండలం కారేపల్లి గ్రామంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా నిపుణులు మాట్లాడుతూ, రైతులు తమ పొలాల నుంచి మట్టి నమూనాలను సేకరించి పరీక్షల కోసం సమర్పించాలని సూచించారు. ఈ పరీక్షల ద్వారా మట్టిలోని ప్రధాన పోషకాలు అయిన నత్రజని (ఎన్), ఫాస్ఫరస్ (పీ), పొటాషియం (కే)తో పాటు సూక్ష్మ పోషకాల స్థాయిలను శాస్త్రీయంగా విశ్లేషించి, పంటలకు అవసరమైన ఎరువుల వినియోగంపై మార్గదర్శకాలు అందిస్తామని తెలిపారు.
అధిక ఎరువుల వినియోగం వల్ల మట్టిసారం తగ్గుతున్న నేపథ్యంలో, మట్టి పరీక్షలు చేయించుకోవడం ద్వారా రైతులు ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు అధిక దిగుబడులు సాధించవచ్చని వివరించారు. అలాగే భూమికి అనుకూలమైన పంటల ఎంపిక, భూసంరక్షణకు సంబంధించిన సూచనలు కూడా అందిస్తామని తెలిపారు.
రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ భూమి సారాన్ని పెంచుకోవాలని నిర్వాహకులు కోరారు. మరిన్ని వివరాల కోసం కమ్యూనిటీ ఫెసిలిటేటర్ నక్క హరీష్‌ను 8008768238 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
