భక్తులకు చల్లని త్రాగునీటి సౌకర్యం..
భక్తులకు చల్లని త్రాగునీటి సౌకర్యం..
రూ. లక్ష విలువైన వాటర్ ప్లాంట్ విరాళం
వేసవి వేళ భక్తుల దాహార్తి తీర్చేందుకు ప్రత్యేక ఏర్పాటు
దాత కుటుంబాన్ని ఆలయ మర్యాదలతో సత్కరించిన అధికారులు
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ట్రస్ట్ బోర్డు సభ్యుడు, స్పెషల్ ఇన్వైటీ దాత వెలగపూడి శంకర్ బాబు, శ్రీదేవి దంపతులు తమ మనవడు సుహాస్ కృష్ణ పేరుమీద సుమారు రూ.1 లక్ష విలువైన వాటర్ ప్లాంట్ను ఆలయానికి విరాళంగా అందజేశారు. వేసవి కాలంలో కొండపైకి వచ్చే భక్తులకు త్రాగునీటి కొరత లేకుండా ఉండేలా ఓం టర్నింగ్ ప్రాంతంలో ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.
300 లీటర్ల సామర్థ్యం గల ఈ వాటర్ ప్లాంట్ ద్వారా ప్రతిరోజూ వేలాది మంది భక్తులకు స్వచ్ఛమైన, చల్లటి త్రాగునీరు అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా దాత వెలగపూడి శంకర్ బాబు మాట్లాడుతూ, అమ్మవారి సేవలో భాగస్వాములు కావడం తమ కుటుంబానికి ఆనందంగా ఉందన్నారు. భక్తుల దాహార్తి తీర్చే సేవలో తమవంతు సహకారం అందించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయ అధికారులు దాత కుటుంబం చూపిన సేవాభావాన్ని అభినందిస్తూ, అమ్మవారి ప్రసాదాలు అందజేసి ఆలయ మర్యాదలతో సత్కరించారు. ప్రస్తుత తీవ్ర ఎండల పరిస్థితుల్లో ఈ వాటర్ ప్లాంట్ భక్తులకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని ఆలయ వర్గాలు వెల్లడించాయి.
