యువతను మింగేస్తున్న బెట్టింగ్ యాప్స్
యువతను మింగేస్తున్న బెట్టింగ్ యాప్స్
హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణలో ఇటీవలి కాలంలో ఆన్లైన్ గేమ్స్, ముఖ్యంగా నగదుతో ముడిపడిన బెట్టింగ్ యాప్స్ వ్యసనంగా మారుతోంది. ప్రధానంగా యువతే దీని ఉచ్చులో పడుతున్నారు. మొదట కాస్త ఆసక్తికరంగా ఉన్నా… రానురాను దాంతో డబ్బు కోల్పోయి ఆర్థికంగా దెబ్బతింటున్నారు. చివరకు వాటిని తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట మనకు గోచరిస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితిపై కుటుంబాలు, పోలీస్ శాఖలు, నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొబైల్ ఫోన్లు, చౌకైన ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో ఆన్లైన్ గేమింగ్‌పై యువత ఆకర్షితులవుతున్నారు.
మొదట వినోదంగా మొదలైన ఈ అలవాటు, క్రమంగా డబ్బుతో ఆడే గేమ్స్, బెట్టింగ్ యాప్స్ వైపు మళ్లుతోంది. చిన్న మొత్తాలతో ప్రారంభమైన ఆటలు, చివరకు పెద్దమొత్తాలకు చేరి నష్టాలు పెరుగుతుండటంతో అప్పులు చేసి మరీ ఆడే స్థితికి చేరుకుంటున్నారు. అప్పుల ఒత్తిడి, కుటుంబ సమస్యలు, మానసిక ఆందోళనలు కలసి కొంతమందిని ఆత్మహత్యల దిశగా నెట్టేస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి నగరాల్లో అనేక కేసులు వెలుగుచూశాయి. ఒక యువకుడు బెట్టింగ్ యాప్స్‌లో భారీగా నష్టం చవిచూసి అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన, మరో విద్యార్థి గేమింగ్ ఓటములు, కుటుంబ మందలింపులు భరించలేక ప్రాణాలు తీసుకున్న సంఘటన, ఉద్యోగస్తులు సైతం ఈ వ్యసనానికి గురై ఆర్థికంగా కుప్పకూలిన ఉదాహరణలు. ఈ ఘటనలు సమాజంలో తీవ్ర చర్చకు దారితీశాయి.
చట్టం తీసుకొచ్చిన కేంద్రం
నగదుతో ముడిపడిన ఆన్లైన్ గేమ్స్‌ను నిషేధిస్తూ చట్టం తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా నిబంధనలను నోటిఫై చేసింది. గతేడాది పార్లమెంట్ ఆమోదం పొందిన ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్‌ను అమలు చేయడానికి అవసరమైన నిబంధనలను కేంద్రం తీసుకొచ్చింది.
మానసిక వైద్యులు, సైబర్ నిపుణులు చెబుతున్నది ఏమంటే?
ఆన్లైన్ గేమింగ్ కూడా మత్తు పదార్థాల వ్యసనంలా మారుతుంది. నష్టాలు వచ్చిన కొద్దీ మరొక్కసారి గెలుస్తాననే భావన పెరుగుతుంది. ఇది డిప్రెషన్, ఆందోళనలకు దారి తీస్తుంది. పిల్లల మొబైల్ వినియోగంపై పర్యవేక్షణ చాలా అవసరం. ఆర్థిక లావాదేవీలపై జాగ్రత్త వహిస్తూ ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం తల్లిదండ్రుల బాధ్యత. మొబైల్లో ఏమైనా అనుమానాస్పద యాప్స్‌ను గుర్తిస్తే వాటిని వెంటనే తొలగించాలి. అలాగే సమస్యలు ఎదురైతే కుటుంబ సభ్యులతో, నిపుణులతో మాట్లాడటం చేయాలి కానీ తొందరపడకూడదు.
దేశంలో ఆన్లైన్ గేమింగ్ రంగాన్ని క్రమబద్ధీకరించేందుకు ఆరుగురు అధికారులతో అథారిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ఛైర్మన్, ఎక్స్ అఫిషియోగా ఉంటారని కేంద్రం ప్రకటించింది. హోం శాఖ సంయుక్త కార్యదర్శి, ఆర్థిక వ్యవహారాల సంయుక్త కార్యదర్శి, సమాచార ప్రసార శాఖ సంయుక్త కార్యదర్శి, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి, న్యాయశాఖ సంయుక్త కార్యదర్శి ఎక్స్ అఫిషియో సభ్యులుగా వ్యవహరిస్తారని పేర్కొంది.
నోటిఫై చేసిన ఈ నిబంధనలు ఈ నెలలోనే అమల్లోకి రానున్నాయి. దీంతో పాటు ఆన్లైన్ గేమింగ్ అథారిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఏ గేమ్ చట్టబద్ధమైనదో, ఏది కాదో నిర్ణయించే అధికారం ఈ అథారిటీకి ఉంటుంది. రియల్ మనీ గేమ్స్ కాకపోతే చాలా వరకు తప్పనిసరి రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదని ఐటీ సెక్రటరీ ఎస్. కృష్ణన్ ఇటీవల ఓ ప్రకటనలో తెలిపారు.
అయితే, ఈ-స్పోర్ట్స్ గేమ్స్ మాత్రం చట్టంలో పేర్కొన్న ప్రకారం రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఆన్లైన్ మనీ గేమా? సోషల్ గేమా? ఈ-స్పోర్ట్స్ గేమా? అని నిర్ధారించుకోవడం పూర్తిగా ఐచ్ఛికమని పేర్కొన్నారు. అథారిటీ ఏదైనా గేమ్‌ను సుమోటోగా చేపట్టడం, ఈ-స్పోర్ట్స్ గేమ్స్, నిర్దిష్ట సోషల్ గేమ్స్‌ను కేంద్రం నోటిఫై చేసిన సందర్భాల్లో మాత్రం గుర్తింపును నిర్దారించుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
ఆన్లైన్ గేమ్స్ వినోదానికి పరిమితమైతే మంచిదే కానీ, డబ్బుతో ముడిపడిన బెట్టింగ్ యాప్స్ ప్రాణాంతకంగా మారుతున్నాయి. తెలంగాణలో పెరుగుతున్న ఆత్మహత్యలు ఈ ప్రమాదానికి స్పష్టమైన హెచ్చరిక. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు, సమాజం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
