దశాబ్దాల తర్వాత రైతుల సమస్యలకు పరిష్కారం
దశాబ్దాల తర్వాత రైతుల సమస్యలకు పరిష్కారం
ఉమ్మడి గుంటూరు, ఆంధ్రప్రభ బ్యూరో: వేలాది ఎకరాలకు సాగునీరు, 33 గ్రామాలకు తాగునీరు అందించే గుంటూరు ఛానెల్ ఆధునీకరణ, విస్తరణ గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైంది. ఛానెల్ వెంట ఉన్న గ్రామాలకు చెందిన రైతులు కలెక్టర్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. విస్తరణ కోసం ఇప్పటికీ పోరాటం కొనసాగిస్తున్నారు.
గత ప్రభుత్వం రైతుల మొర ఆలకించకపోవడంతో, గత ఎన్నికల సమయంలో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ రైతులకు భరోసా ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు ఆధునీకరణకు పరిపాలనపరమైన అనుమతులు మంజూరయ్యాయి. గుంటూరు ఛానెల్ ఆధునికీకరణ పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.369.2 కోట్ల విడుదలకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.
47 కిలోమీటర్ల మేర గుంటూరు ఛానెల్ ఆధునికీకరణతో పాటు లీడింగ్ ఛానెల్, డిస్ట్రిబ్యూటరీల అభివృద్ధికి చర్యలు చేపట్టారు. దీంతో ప్రభుత్వం చర్యలకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మంగళవారం గుంటూరు ఛానెల్‌ను పరిశీలించనున్నారు.
ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 33,000 ఎకరాలకు పైగా సాగునీరు స్థిరీకరణ చేపట్టనున్నారు. దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు జిల్లా యంత్రాంగం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి దశలో భాగంగా నిధులు విడుదల చేయనున్నారు.
గుంటూరు ఛానెల్ పొడిగింపు పనులు పర్చూరు వరకు చేపట్టాలని అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 47 కిలోమీటర్ల పొడవున లీడింగ్ ఛానెల్, డిస్ట్రిబ్యూటరీల ఆధునికీకరణ పనులు చేపడతారు. 33 వేల ఎకరాల ఆయకట్టుకు స్థిరీకరణతో పాటు 33 గ్రామాలకు సాగు, తాగునీటి భరోసా కల్పిస్తారు. గారపాడు నుంచి పర్చూరు వరకు ఛానెల్ పొడిగింపు పనులు కూడా చేపడతారు. ఇందుకు సంబంధించిన భూ పరిహార అంశాలను పరిశీలిస్తున్నారు. ఈ ఆధునికీకరణ పనులు గుంటూరు జిల్లా రైతులకు, ప్రజలకు దశాబ్దాలుగా ఉన్న సాగునీటి కష్టాలను తీర్చనున్నాయని భావిస్తున్నారు.
ఆయకట్టు స్థిరీకరణ..
గుంటూరు వాహిని ప్రస్తుతం 600 క్యూసెక్కుల సామర్థ్యంతో ఉండగా, దాన్ని 750 క్యూసెక్కులకు పెంచేలా విస్తరించనున్నారు. ఇరువైపులా గోడలు నిర్మించడం ద్వారా నీటి వృథాను అరికట్టనున్నారు. కాలువ వెడల్పును 18 మీటర్లకు పెంచనున్నారు. దీంతో 350 క్యూసెక్కుల నీటిని సులభంగా తరలించవచ్చు. గుంటూరు జిల్లాలో కాకుమాను, ప్రత్తిపాడు, పెదనందిపాడు మండలాలతో పాటు బాపట్ల జిల్లాలో పర్చూరు, పల్నాడు జిల్లాలో చిలకలూరిపేట ప్రాంతాల్లో మొత్తం 38,400 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది.
నాగార్జునసాగర్ కుడికాలువ కింద మల్లాయపాలెం, కాకుమాను మేజర్ కాలువల పరిధిలోని 9,600 ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించి స్థిరీకరిస్తారు. ఛానెల్ ద్వారా సాగునీటితో పాటు తాగునీటి అవసరాలు కూడా తీరనున్నాయి. ఈ పనులు ఆలస్యమయ్యే కొద్దీ వ్యయం పెరుగుతుందని, అందువల్ల వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని నల్లమడ రైతు సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు.
