ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ధర్నా
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ధర్నా
చౌటుప్పల్, ఆంధ్రప్రభ: యాసంగి ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం చౌటుప్పల్ ఆర్‌డిఓ కార్యాలయం ముందు తెలంగాణ రైతు సంఘం, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులు భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్‌డిఓ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. చౌటుప్పల్ మండలంలోని చిన్న కొండూరు, పెద్దకొండూరు, మందొల్లగూడెం, నేలపట్ల, జై కేసారం, ఎస్.లింగోటం, పంతంగి, అంకిరెడ్డిగూడెం, తాళ్ల సింగారం, ధర్మోజిగూడెం గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా, ఒక్కో సెంటర్‌లో 70 నుండి 80 వేల బస్తాల ధాన్యం నిల్వ ఉండగా, కేవలం 2వేల నుండి 3వేల బస్తాలు మాత్రమే కొనుగోలు చేశారని విమర్శించారు.
ఇదే పరిస్థితి కొనసాగితే ధాన్యం మొత్తం కొనుగోలు చేయడానికి 3 నుండి 4 నెలల సమయం పడుతుందని, ఈలోపు వర్షాలు పడితే రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. రోజుకు కనీసం 3 నుండి 4 లారీల ధాన్యం కొనుగోలు చేయాలని, మార్కెట్‌లో మిల్లర్ల వద్ద జరుగుతున్న తరుగు దోపిడీని నిలిపివేయాలని, మార్కెట్ యార్డుల్లో రైతులకు మంచినీరు, విద్యుత్, వాచ్‌మెన్ టార్పాలిన్ పట్టాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం, సిపిఎం నాయకులు చీరిక అలివేలు, ఎండి పాషా, బండారు నరసింహ, పొట్ట శ్రీను, ఆకుల ధర్మయ్య, చప్పిడి రాఘవరెడ్డి, బోరం నర్సిరెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నారు.
