డీఎంహెచ్ఓ గారూ… రోగుల ప్రాణాలు కాపాడండి..!
డీఎంహెచ్ఓ గారూ… రోగుల ప్రాణాలు కాపాడండి..!
- క్యాన్సర్ సర్జరీ పేరుతో ప్రాణాలపై ప్రయోగాలు
- వరుస ఆపరేషన్లతో మహిళ ప్రాణం కోల్పోయింది
- డాక్టర్ గైర్హాజరు… అనుమానాలు మరింత తీవ్రం
- ఆస్పత్రి ముందు స్థానికుల ఆందోళన
- పోలీసుల జోక్యంతో ఉద్రిక్తత అదుపులోకి
- ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఖమ్మం, ఆంధ్రప్రభ: ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతోనే ఓ మహిళ ప్రాణం కోల్పోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది. డబ్బే ధ్యేయంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకం నగరంలో కలకలం రేపింది. ప్రభుత్వ నిబంధనలు పూర్తి వ్యతిరేకంగా ఆసుపత్రి నిర్వాహణ జరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు. కనీసం ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల సైతం ఆసుపత్రి యాజమాన్యం కఠినంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. రోగులకు కనీస మర్యాద సైతం ఇవ్వరని దురుసుగా ప్రవర్తిస్తారనే ఆరోపణలు ఆసుపత్రి సిబ్బందిపై ఉన్నాయి. బూడిదెంపాడు గ్రామానికి చెందిన ఓ మహిళ (32) క్యాన్సర్ చికిత్స కోసం ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. సరైన వైద్యపర్యవేక్షణ లేకుండా శస్త్ర చికిత్సలు చేయడం వల్లే ఆమె మృతి చెందినట్లు- పలువురు ఆరోపిస్తున్నారు. వైద్యుల తప్పిదాలే ఈ ఘటనకు కారణమని వారు స్పష్టం చేస్తున్నారు. చికిత్స పేరుతో రోగిపై ప్రయోగాలు చేసినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిర్లక్ష్య వైద్యం కారణంగా ఓ యువతి ప్రాణం పోవడం ప్రజల్లో ఆగ్రహం రేకెత్తిస్తోంది. ఆస్పత్రులపై నమ్మకం కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
వరుస సర్జరీలతో ప్రమాదం
మహిళకు మొదట క్యాన్సర్‌కు సంబంధించిన శస్త్ర చికిత్స నిర్వహించినట్లు సమాచారం. ఆ సర్జరీ సక్రమంగా జరగకపోవడంతో పరిస్థితి విషమించినట్లు- స్థానికులు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో మళ్లీ రెండోసారి శస్త్ర చికిత్స చేయడం మరింత ప్రమాదానికి దారి తీసిందని అంటు-న్నారు. ఛాతీ భాగంలో సర్జరీ చేయడంతో పాటు- ప్లాస్టిక్ సర్జరీ కూడా చేసినట్లు- తెలుస్తోంది. ఒకే రోగిపై వరుసగా ఆపరేషన్లు చేయడం వైద్య నిబంధనలకు విరుద్ధమని ఆరోపిస్తున్నారు. సరైన పరీక్షలు, జాగ్రత్తలు లేకుండా నిర్ణయాలు తీసుకోవడం ప్రాణాంతకంగా మారిందని విమర్శిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అందుబాటులో లేని డాక్టర్..
ఈ ఘటనలో శస్త్ర చికిత్స చేసిన డాక్టర్ అందుబాటులో లేకపోవడం మరింత అనుమానాలకు తావిస్తోంది. ఘటన జరిగిన వెంటనే ఆయన కనిపించకపోవడాన్ని స్థానికులు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. తప్పిదం జరగలేదంటే ఎందుకు బయటకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి యాజమాన్యం కూడా స్పష్టత ఇవ్వకపోవడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. వైద్యుల నిర్లక్ష్యాన్ని దాచిపెట్టే ప్రయత్నం జరుగుతోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యులను రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజానిజాలు వెలికితీయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఆస్పత్రి వద్ద ఆందోళన, ఉద్రిక్తత..
మహిళ మృతి వార్తతో పలువురు ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యంపై నినాదాలు చేస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రి యాజమాన్యాన్ని నిలదీస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇతర రోగులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు కూడా బాధితులకు మద్దతుగా ముందుకు వచ్చారు. ఈ ఘటనతో ఆస్పత్రి సేవలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
పోలీసుల జోక్యం… చర్యలపై డిమాండ్
ఆస్పత్రి యాజమాన్యం సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులను సమాధాన పరుస్తూ పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. అవసరమైతే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని చెప్పారు. వైద్యుల నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ ఊపందుకుంది. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఆది నుంచి ఆ ఆసుపత్రిపై ఆరోపణలే..
నగరంలోని ఎన్ఎస్టీ రోడ్డులో గల ఆసుపత్రిలో ఆది నుంచి అన్ని ఆరోపణలే వినిపిస్తున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. నిబంధనలకు పూర్తి విరుద్ధంగా హాస్పిటల్ యాజమాన్యం హాస్పిటల్‌ను నిర్వహిస్తున్నట్ల ఘటన వెలుగులోకి రావడంతో పలువురు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి నిర్వాహకులు వైద్యశాఖలో పలువురితో సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఆసుపత్రి జోలికి అధికారులు రారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా వైద్యశాఖ ఆసుపత్రిపై పూర్తి స్థాయిలో విచారణ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటాలు ఆడే ఆసుపత్రులను సీజ్ చేయాలని స్థానికులు కోరుతున్నారు.
డీఎంహెచ్ఓ గారూ… రోగుల ప్రాణాలు కాపాడండి..:
డీఎంహెచ్ఓ గారూ.. ప్రాణాల కాపాడాలి అంటూ ప్రజలు వేడుకుంటున్నారు. నగరంలో వరుస ఘటనలతో భయాందోళనలకు గురవుతున్న ప్రజలు. అక్రమార్జన, డబ్బే ధ్యేయంగా నగరంలోని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహణ ఉందంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. వైద్య, ఆరోగ్యశాఖకు సంబంధించిన నిబంధనలను తుంగలో తొక్కి నగరంలోని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల పనితీరు ఉందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నగరంలోని ఎన్ఎస్టీ రోడ్డులో గల ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రోగి మృతి చెందిన ఘటనతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా వైద్య, ఆరోగ్యశాఖ ఆ ప్రైవేట్ ఆసుపత్రిపై చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలు కాపాడాలని ప్రజలు వేడుకుంటున్నారు. చర్యలు తీసుకోకుంటే భవిష్యత్తులో మరింత ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని వైద్య, ఆరోగ్యశాఖకు చెడ్డ పేరు వస్తుందని పలువురు పేర్కొంటున్నారు.
డీఎంహెచ్ఓ గారూ… రోగు ప్రాణాలు కాపాడండి..!
