ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్‌..

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్‌..

జాయింట్ కలెక్టర్ ఇలాక్కియా

ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశా ఆదేశాల మేరకు మండల కేంద్రమైన ఎ.కొండూరులోని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజల సమస్యలతో కిటకిటలాడింది. ఈ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ ఇలక్కియా ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా పంచాయతీ రాజ్, డ్వామా, డీఆర్‌డీఏ, వ్యవసాయ శాఖ,జలవనరుల శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, ఉద్యాన శాఖ, జీసీడబ్ల్యూఓ, సివిల్ సప్లైస్, పోలీస్, విద్యుత్ తదితర విభాగాలకు చెందిన అధికారులు హాజరై ప్రజల నుండి వినతులను స్వీకరించారు.

మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హాజరై తమ సమస్యలను వివరించారు. మొత్తం అందిన అర్జీలలో రెవెన్యూ,భూసంబంధిత సమస్యలే అధికంగా ఉండటం గమనార్హం. రెవెన్యూ విభాగానికి 110 అర్జీలు,మండల పరిషత్ అభివృద్ధికి 34, డీఆర్‌డీఏకు 18, జీడబ్ల్యూఎస్‌కు 8,సివిల్ సప్లైస్‌కు 5, పోలీస్ శాఖకు 2, డీసీహెచ్‌ఎస్‌కు 2, ఇరిగేషన్‌కు 2, విద్యుత్ శాఖకు 2, డ్వామాకు 2, వ్యవసాయ శాఖకు సంబంధించిన పలు అర్జీలు వచ్చినట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు.రెవెన్యూ సమస్యలు అధికంగా రావడంతో వాటి పరిష్కారంపై స్పష్టత లేక అధికారులు తాత్కాలికంగా అర్జీలను స్వీకరించినప్పటికీ, ఆన్లైన్ ప్రక్రియ చేపట్టకపోవడం పట్ల ప్రజల్లో సందేహాలు వ్యక్తమయ్యాయి.

అర్జీలను నిజంగా నమోదు చేస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాదిగ ఫైనాన్స్ కార్పోరేషన్ డైరెక్టర్ వాసం మునియ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో చెరువుల నుంచి గృహ అవసరాలకు మట్టి తీసుకెళ్లడాన్ని రెవెన్యూ, పోలీస్ శాఖలు అడ్డుకుంటున్నాయని ఫిర్యాదు చేశారు. ఈ సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాలని జేసీని కోరారు. ఎన్టీఆర్ జిల్లా కౌలు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి మేకల డేవిడ్ మాట్లాడుతూ మండలంలో వరి, మొక్కజొన్న కొనుగోలులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు.

మిల్లర్లు ధాన్యంపై క్వింటాకు 5 నుండి 8 కిలోల వరకు తరుగు విధిస్తూ రైతులను నష్టపరుస్తున్నారని ఆరోపించారు.గన్ని బ్యాగుల కొరత, రవాణా సౌకర్యాల లేమితో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, 20 రోజులుగా ధాన్యాన్ని కల్లాల్లో ఆరబోసి వేచి చూస్తున్నారని తెలిపారు. మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు తక్షణమే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని వినతిపత్రం సమర్పించారు. ఇదే కార్యక్రమంలో గొల్లమందల గ్రామానికి చెందిన దాడి వసుదాదేవి తన కుటుంబ సభ్యుల నుండి ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని పోలీస్ శాఖపై ఫిర్యాదు చేశారు.

ప్రజా దర్బార్‌లో పెన్షన్లు, భూసంబంధిత సమస్యలు,సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై అధిక సంఖ్యలో వినతులు వచ్చాయి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ ఇలక్కియ సూచించారు. అర్జీలన్నింటినీ పరిశీలించి,నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కారం చూపుతామని ఆమె హామీ ఇచ్చారు.అయితే అర్జీల ఆన్లైన్ నమోదు లేకపోవడం, పరిష్కారంలో ఆలస్యం జరుగుతుందనే భయంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అధికారులు ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.