గుంటూరు ఛానల్‌కు మహర్దశ

గుంటూరు ఛానల్‌కు మహర్దశ

రూ. 369.20 కోట్లతో ఆధునికీకరణ పనులకు పచ్చజెండా
పెమ్మసాని కృషితో నిధుల మంజూరు..

గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లా వాసుల రెండు దశాబ్దాల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. కీలకమైన గుంటూరు ఛానల్ ఆధునికీకరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు రూ. 369.20 కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా అటు సాగునీటి వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు, ఇటు తాగునీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం లభించనుంది. కృష్ణా డెల్టా సిస్టమ్‌లో భాగంగా 0 నుంచి 47 కిలోమీటర్ల మేర లీడింగ్ ఛానల్‌తో పాటు అనుబంధ డిస్ట్రిబ్యూటరీల అభివృద్ధికి ప్రభుత్వం జీవో నంబర్ 217 (తేదీ: 04-05-2026) ద్వారా నిధులు కేటాయించింది.

ఈ నిర్ణయంతో 33 వేల ఎకరాలకు పైగా ఆయకట్టు స్థిరీకరణ జరగడమే కాకుండా, 33 గ్రామాల పరిధిలోని సుమారు 4 లక్షల మంది ప్రజలకు మేలు చేకూరనుంది. ​కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఈ నిధుల సాధనలో కీలక పాత్ర పోషించారు. ఈ ప్రాజెక్టు మంజూరుపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ, పెరిగిన నీటి వినియోగ సామర్థ్యం వల్ల వ్యవసాయ ఉత్పాదకత గణనీయంగా పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, లోకేశ్ తదితరుల సహకారంతో ఈ కల సాకారమైందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు సాధనలో మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేల కృషి కూడా ఎంతో ఉందని కొనియాడారు. ​ప్రకాశం బ్యారేజీ ఎగువన కృష్ణా నది కుడి గట్టు నుంచి ప్రారంభమయ్యే ఈ కాలువ తాడేపల్లి, మంగళగిరి, పెదకాకాని, గుంటూరు సహా పలు మండలాలకు జీవనాడిలా ఉంది.

ప్రస్తుతం గుంటూరు కార్పొరేషన్, మంగళగిరి మున్సిపాలిటీతో పాటు 33 గ్రామాలకు ఇది తాగునీటిని అందిస్తోంది. తాజా ఆధునికీకరణ పనులతో పాటు మరో 30 కిలోమీటర్ల మేర కాలువ విస్తరణకు కూడా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ విస్తరణ పూర్తయితే భవిష్యత్తులో అదనంగా మరో 41 గ్రామాలకు తాగునీరు, దాదాపు 50 వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో జిల్లా రైతాంగం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తోంది.

Leave a Reply