14-point | నిర్ణయం అమెరికాదే

14-point | నిర్ణయం అమెరికాదే

తెరపైకి ఇరాన్ సరికొత్త డిమాండ్లు
14 పాయింట్లతో ప్రతిపాదనలు
అమెరికా ముందుంచిన ఇరాన్
లెబనాన్ సహా అన్ని యుద్ధాలు ముగించాలి
కాల్పుల విరమణ పొడిగింపు తిరస్కరణ
తాత్కాలిక సంధికి బదులుగా 30 రోజుల్లో వార్ ఆపేయాలి
తమపై మళ్లీ దాడిచేయకుండా భద్రతా హామీ ఇవ్వాలి
అధికారికంగా వెల్లడించిన టెహ్రాన్
సమీక్షిస్తాం.. ప్రతిపాదనలపై స్పందించిన ట్రంప్
14-point | న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : అమెరికా- ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సంఘర్షణను ముగించేందుకు ఇరాన్ 14 పాయింట్లతో కొత్త ప్రతిపాదనలను తెరపైకి తెచ్చింది. పాకిస్థాన్ ద్వారా దీన్ని తాజాగా అమెరికాకు పంపిందని టెహ్రాన్ అధికారిక మీడియా పేర్కొంది. ఈ ప్రతిపాదనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. సంఘర్షణ ముగించేందుకు అమెరికా నుంచి వచ్చిన 9 పాయింట్లనకు స్పందనగా.. ఇరాన్ ఈ 14 పాయింట్లతో తాజా ప్రతిపాదనలు చేసింది. ఇందులో లెబనాన్‌తో సహా అన్ని విధాలుగా యుద్ధాన్ని ముగించాలని టెహ్రాన్ పిలుపునిచ్చింది.
అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ పొడిగింపును ఇరాన్ తిరస్కరించింది. తాత్కాలిక సంధికి బదులుగా.. 30 రోజుల్లోగా యుద్ధం శాశ్వతంగా ముగించేలా సమగ్ర పరిష్కారాన్ని కోరింది. దీంతో పాటు తమపై మళ్లీ దాడులు చేయకుండా భద్రతా హామీలు ఇవ్వాలని, సరిహద్దు ప్రాంతాల్లో అమెరికా తన బలగాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. వివిధ దేశాల్లో స్తంభింపజేసిన తమ ఆస్తులను విడుదల చేయాలని, తమపై విధించిన ఆంక్షలను కూడా ఎత్తివేయాలని ప్రతిపాదనల్లో ప్రస్తావించింది. హర్మూజ్ జలసంధిలో దిగ్బంధనాన్ని ఎత్తివేయడం, యుద్ధం కారణంగా జరిగిన నష్టానికి పరిహారం చెల్లించడం వంటివి కూడా ఇందులో ఉన్నాయి.
14-point | బంతి అమెరికా కోర్టులోనే: ఇరాన్
యుద్ధానికి శాశ్వత ముగింపు పలకడమే తమ ప్రతిపాదనల లక్ష్యమని ఇరాన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి కాజెమ్ ఘరీబాబాదీ పేర్కొన్నారు. దౌత్య మార్గాన్ని ఎంచుకోవాలా.. లేదంటే ఘర్షణ వైఖరినే కొనసాగించాలా అనే నిర్ణయం ఇప్పుడు అమెరికానే తీసుకోవాలన్నారు. తమ జాతీయ ప్రయోజనాలు, భద్రతను కాపాడుకునేందుకు ఇరాన్ రెండింటికీ సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు.
14-point | త్వరలో సమీక్షిస్తా: ట్రంప్
ఇరాన్ పంపిన ప్రతిపాదనలపై ట్రంప్ స్పందించారు. వీటిని త్వరలోనే తాను సమీక్షిస్తానని ట్రూత్ సోషల్ వేదికగా పేర్కొన్నారు. అయితే, గత 47 ఏళ్లుగా మానవాళికి, ప్రపంచానికి వారు చేసిన దానికి.. ఇంకా తగిన మూల్యం చెల్లించుకోలేదన్నారు. కాబట్టి.. ఈ ప్రణాళిక ఆమోదించేలా ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు.
