మద్యం ధరల పెంపుకు ప్రభుత్వం సిద్ధం

మద్యం ధరల పెంపుకు ప్రభుత్వం సిద్ధం

హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : ఆదాయ వనరులను పెంచుకువడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో మద్యం ప్రియులకు షాక్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది . మద్యం ధరలను భారీగా పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ధరలను పెంచడం వల్ల మద్యం వ్యాపారులతో పాటు సామాన్య వినియోగదారులపై భారీ భారం పడనుంది. ప్రభుత్వ ప్రతిపాదనల ప్రకారం సాధారణ బ్రాండ్స్ (రెగ్యులర్ బ్రాండ్లు)ఫుల్ బాటిల్పై రూ.60, ప్రీమియం బ్రాండ్ ఫుల్ బాటిల్పై రూ.100 పెంచనున్నట్లు తెలిసింది. హయ్యర్ కేటగిరి బ్రాండ్లు ఫుల్ బాటిల్ పై ఏకంగా రూ 120 వరకు పెరగనున్నట్టు సమాచారం. మద్యం ధరల పెంపు పై వారంలో ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ అధికారులు ఇప్పటికే ప్రాధమిక కసరత్తు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదించినట్టు సమాచారం.

మద్యం ధరలు పెంచాలని లిక్కర్ కంపెనీలు చాలా రోజులుగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో ధరల పెంపుపై ప్రభుత్వం ఇప్పటికే కమిటీని నియమించింది . ఆ కమిటీ డిస్టలరీల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. ఈ ప్రక్రియ అనంతరం మద్యం ధరలు పెంచుతూ నిర్ణయం వెలువరించే అవకాశం ఉన్నట్టు తెలిస్తోంది. రెండేళ్లకు ఓ సారి రాష్ట్రంలో ప్రతి రెండేండ్లకోసారి మద్యం ధరలు పెంచే ఆనవాయితి ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2023 మే మాసంలో అప్పటి ప్రభుత్వం మద్యం ధరలను పెంచింది. నిబంధనల ప్రకారం గత ఏడాది (2025) మే నెలలో మద్యం ధరలను పెంచాలి. అయితే అప్పుడు వివిధ కారణాల వల్ల ప్రభుత్వం మద్యం ధరలను పెంచలేకపోయింది. అప్పటి నుంచి మద్యం ధరలను సవరించాలని మద్యం తయారు చేసే కంపెనీలు ప్ర భుత్వాన్ని కోరుతున్నాయి. అయితే తాజాగా పశ్చిమాసియా లో నెలకొన్న పరిస్థితులు, యుద్ధం నేపథ్యంలో మద్యం సీసాల తయారీపై ప్రభావం పడింది. బాటిల్స్ తయారీ కోసం ఉపయోగించే గ్యాస్ ధరలు, మద్యం ఉత్పత్తి ఖర్చులు భారీగా పెరిగాయి.

దీంతో రేట్లు పెంచాలని మరోసారి కంపెనీలు ప్రభుత్వాన్ని కోరాయి. వచ్చే వారం సమావేశం మద్యం ధరల సవరణ కోసం ప్రభుత్వం గతంలో ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది. ఈ కమిటీ వచ్చే వారం సమావేశం కానుంది. మద్యం కంపెనీల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. భారీగా ధరలు పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో సాధారణ బ్రాండ్స్కు చెందిన పుల్ బాటిల్పై రూ.60 వరకు, ప్రీమియం బ్రాండ్స్ ఫుల్ బాటిల్పై రూ.100 వరకు పెంచాలని ప్రతిపాదించినట్టు సమాచారం. ధరలు పెరిగితే ప్రతినెలా రూ.250 కోట్లు, ఏడాదికి సుమారు రూ.3 వేల కోట్ల వరకు ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరనుంది. మద్యం ధరల సవరణ పై ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోంది.

ఆ నివేదిక ఆధారంగా ఈ నెలలోనే లిక్కర్ ధరలపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. అయితే, ధరలు భారీగా పెంచితే సామాన్యుల నుంచి వ్యతిరేకత రావడమే కాకుండా, గ్రామాల్లో గుడుంబా, కల్తీ మద్యం వంటి అక్రమ మద్యం తయారీ పెరిగే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రజలపై భారం పడకుండా, అటు కంపెనీలకు నష్టం కలగకుండా మధ్యేమార్గం ఆలోచనలో ప్రభుత్వం ఉంది. వచ్చే వారం కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా, ఈ నెలాఖరులోగా కొత్త ధరలపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. మొత్తానికి మందు బాబుల జేబులకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది.

Leave a Reply