ధర్మవరం చరిత్ర–సంస్కృతి పుస్తక ఆవిష్కరణ..

ధర్మవరం చరిత్ర–సంస్కృతి పుస్తక ఆవిష్కరణ..

ధర్మవరం, ఆంధ్రప్రభ : ధర్మవరం పట్టణ చరిత్రను, సంస్కృతిని ప్రతిబింబించే “ధర్మవరం చరిత్ర–సంస్కృతి” పుస్తకాన్ని తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ఆవిష్కరించారు. విశ్రాంత జూనియర్ లెక్చరర్ నరేష్ కుమార్ “జయసుమన్” అనే కలంపేరుతో రచించిన ఈ గ్రంథం, 1500 సంవత్సరం నుంచి 2026 వరకు ధర్మవరం అభివృద్ధి, చారిత్రక విశేషాలను సమగ్రంగా ప్రతిబింబిస్తుంది. చెన్నకేశవస్వామి రథోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీరామ్ స్వయంగా 100 పుస్తకాలను కొనుగోలు చేసి పార్టీ నాయకులు, ప్రముఖులకు పంపిణీ చేయడం విశేషంగా నిలిచింది. అనంతరం రచయిత జయసుమన్ దంపతులను ప్రత్యేకంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ, “ఇది సాధారణ పుస్తకం కాదు, ధర్మవరం 526 ఏళ్ల చరిత్రను ప్రతిబింబించే అమూల్య గ్రంథం” అని పేర్కొన్నారు. ధర్మవరం ప్రతి మూలకు ప్రత్యేక చారిత్రక ప్రాధాన్యం ఉందని, గత సంఘటనలు, సంస్కృతి, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చేనేత వృత్తి ప్రాధాన్యతను రచయిత సమగ్రంగా వివరించారని తెలిపారు.

అలాగే స్వాతంత్ర్యం తర్వాతి రాజకీయ పరిణామాలు, ధర్మవరాన్ని పాలించిన నేతలు, పట్టణ అభివృద్ధి దశలు వంటి అనేక అంశాలు ఈ పుస్తకంలో ఉన్నాయని చెప్పారు. ధర్మవరం ప్రజలు తప్పక చదవాల్సిన గ్రంథమిదని సూచించారు. ఇలాంటి విలువైన పుస్తకాన్ని రచించిన జయసుమన్‌ను ప్రతి ఒక్కరూ అభినందించాల్సిన అవసరం ఉందని, సాహిత్య సంప్రదాయాన్ని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని శ్రీరామ్ తెలిపారు.