​మేడ్చల్‌లో ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

మేడ్చల్, ఆంధ్రప్రభ : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్‌లో ఐకేపీ (IKP) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింహులు యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం రోజు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతులు పండించిన ప్రతి గింజకూ గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

రైతులు మధ్యవర్తులను నమ్మి మోసపోకుండా, నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారానే తమ పంటను విక్రయించుకోవాలని సూచించారు. దీనివల్ల రైతులకు ఆర్థికంగా మేలు జరుగుతుందని తెలిపారు. మేడ్చల్ ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిసర గ్రామాల రైతులకు ఈ కేంద్రం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వారు తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సమయానికి సేకరణ పూర్తయ్యేలా చూడాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రైతులు కూడా తమ ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాల మేరకు శుభ్రపరచి కేంద్రానికి తీసుకురావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ మునిసిపల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రేగు రాజు కురుమ, తుంకి భిక్షపతి పాల్గొన్నారు. మేడ్చల్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు నడికొప్పు నాగరాజు (చాపరాజు) ముదిరాజ్, కౌడే మహేష్ కురుమ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గోమారం రమణా రెడ్డి, పిఏసిఎస్ మాజీ చైర్మన్ అంతిరెడ్డి, మాజీ డైరెక్టర్లు మెట్టు వెంకట్ రాంరెడ్డి, సత్యనారాయణ రెడ్డి, నాయకులు నడికొప్పు రంజిత్ ముదిరాజ్, కాలేరు శ్రీకాంత్ వంజరి, వేముల రంజిత్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, ఐకేపీ సిబ్బంది రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రం ప్రారంభం పట్ల స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.