ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆగ్రహం

భీమ్‌గల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం చోటుచేసుకున్న నేపథ్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల అలసత్వం వహించడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ, భీమ్‌గల్ మండల ఐకేపీ ఏపీఎంకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు.

మంగళవారం భీమ్‌గల్ మండలం పల్లికొండ, భీమ్‌గల్ గ్రామాలలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా పల్లికొండ కొనుగోలు కేంద్రంలో నిర్వహణలో లోపాలను గమనించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన వివరాలను సక్రమంగా నమోదు చేయకపోవడం, రిజిస్టర్ అందుబాటులో లేకపోవడం వంటి లోపాలను గుర్తించి కేంద్ర నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిర్వహణ తీరు ఇలాగే కొనసాగితే కమిషన్ నిలిపివేయడంతో పాటు వచ్చే సీజన్‌లో సెంటర్ కేటాయించబోమని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం లేదని ఏపీఎంకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. రైతుల ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.

రైతులకు ఇబ్బందులు కలగకుండా సకాలంలో ధాన్యం సేకరణ జరిగేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మాయిశ్చర్ యంత్రంతో తేమ శాతాన్ని స్వయంగా పరిశీలించడంతో పాటు తూకం యంత్రాల పనితీరును కూడా తనిఖీ చేశారు.

తరుగు, కోతలు లేకుండా రైతులు నష్టపోకుండా పర్యవేక్షణ చేయాలని, 17 శాతం లోపు తేమ ఉన్న ధాన్యాన్ని వెంటనే తూకం వేసి మిల్లులకు తరలించాలని అధికారులకు సూచించారు. వాతావరణ పరిస్థితులను వెదర్ యాప్ ద్వారా ముందుగానే రైతులకు తెలియజేయాలని, ట్యాబ్ ఎంట్రీలను వేగవంతం చేసి రైతుల ఖాతాల్లో బిల్లులు సకాలంలో జమ అయ్యేలా చూడాలని ఆదేశించారు.

తహసీల్దార్, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌వో శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీఎం ప్రవీణ్, డీసీఓ శ్రీనివాస్, ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్, తహసీల్దార్ ఎం. కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.