ఎంబీబీఎస్ పట్టా అందుకున్న ఎమ్మెల్యే బీర్ల కుమార్తె అరుంధతి

ఎంబీబీఎస్ పట్టా అందుకున్న ఎమ్మెల్యే బీర్ల కుమార్తె అరుంధతి
యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య – అనిత దంపతుల ప్రథమ పుత్రిక బీర్ల అరుంధతి వైద్య విద్యలో రాణించి ఎంబీబీఎస్ పట్టా అందుకున్నారు. నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లిలోని ప్రముఖ విద్యాసంస్థ కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (KIMS)లో ఆమె తన వైద్య విద్యను విజయవంతంగా పూర్తి చేశారు.
సోమవారం కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే (పట్టాప్రదానోత్సవం) వేడుకలో అరుంధతి గౌరవ అతిథుల చేతుల మీదుగా తన మెడికల్ డిగ్రీని అందుకున్నారు. విద్యాభ్యాసంలో ఆమె చూపిన పట్టుదల, అంకితభావాన్ని ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందం అభినందించారు.
తన కుమార్తె వైద్యురాలిగా పట్టా పొందడం పట్ల ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య దంపతులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో అరుంధతి ఒక ఉత్తమ వైద్యురాలిగా ఎదిగి, పేద ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు. అరుంధతి ఘనత పట్ల వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, నియోజకవర్గ ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున అభినందనలు తెలుపుతున్నారు. ఒక ప్రజాప్రతినిధి కుమార్తెగా కాకుండా, సొంత కష్టంతో వైద్య విద్యను పూర్తి చేసి పట్టా పొందడం పట్ల అరుంధతిని పలువురు కొనియాడుతున్నారు.
