చిట్యాల మండలంలో డీజిల్ కొరత

చిట్యాల మండలంలో డీజిల్ కొరత
- ‘నో స్టాక్’ బోర్డులతో రైతుల విలవిల
చిట్యాల, ఆంధ్రప్రభ: చిట్యాల మండలవ్యాప్తంగా డీజిల్ కొరత తీవ్రరూపం దాల్చింది. మండలంలోని చిట్యాల, జూకల్, చల్లగరిగ, కొత్తపేట పరిధిలోని పెట్రోల్ బంకుల్లో డీజిల్ నిల్వలు నిండుకోవడంతో వాహనదారులు, ముఖ్యంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తుండటంతో వ్యవసాయ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
ప్రస్తుతం మొక్కజొన్న పంట కోత సమయం కావడంతో కూలీలను తరలించేందుకు, పంటను తరలించేందుకు ట్రాక్టర్లు, టాటా ఏసీ వాహనాలకు డీజిల్ అత్యవసరం. అయితే డీజిల్ దొరకకపోవడంతో వాహనాలు షెడ్లకే పరిమితమయ్యాయి. డీజిల్ కోసం రైతులు పక్కనే ఉన్న టేకుమట్ల, మొగుళ్ళపల్లి, పరకాల, జమ్మికుంట, భూపాలపల్లి వంటి ప్రాంతాలకు వెళ్లినా, అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురవుతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. బంకు యజమానులు కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు.
మండలంలో నెలకొన్న ఈ ఇంధన సంక్షోభంపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోడెల భద్రయ్య ఆందోళన వ్యక్తం చేశారు. డీజిల్ కొరత వల్ల అటు రైతులు, ఇటు ప్రైవేట్ వాహన యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు. జిల్లా స్థాయి అధికారులు వెంటనే స్పందించి, బంకులకు డీజిల్ సరఫరా పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

