యువతలో డ్రగ్స్ విపత్తు..

యువతలో డ్రగ్స్ విపత్తు..

  • విలాసాలకు “గమ్మత్తు” మార్గం
  • గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న డ్రగ్స్ దందా
  • మత్తులో హత్యలు, లైంగిక దాడులు
  • పుస్తకాలు ఉండాల్సిన బ్యాగుల్లో మాదక ద్రవ్యాలు
  • పెడ్లర్లుగా ఇంజినీరింగ్ విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు
  • వెలుగు చూస్తున్న ఉదంతాలు
  • డ్రగ్స్ కట్టడికి సర్కారు ప్రత్యేక చర్యలు
  • పాజిటివ్ వస్తే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హత
  • అయినా మారని యువత తీరు
  • ప్రశ్నార్థకంగా మారుతున్న భవిష్యత్తు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ఒకప్పుడు కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైన డ్రగ్స్ వినియోగం, ఇప్పుడు విద్యార్థులు, ఉద్యోగులు, ముఖ్యంగా యువతలో వేగంగా వ్యాపిస్తోంది. డ్రగ్స్‌కు బానిసలవుతున్న వారు కేవలం వినియోగదారులుగానే కాకుండా, తరువాత పెడ్లర్లుగా మారి ఈ అక్రమ దందా ఊబిలో చిక్కుకుంటున్నారు.

డ్రగ్స్‌కు అలవాటు పడిన కొందరు యువకులు తమ అవసరాలు తీర్చుకునేందుకు తొలుత చిన్న స్థాయిలో సరఫరా మొదలుపెట్టి, తరువాత పూర్తిస్థాయి పెడ్లర్లుగా మారుతున్నారు. క్యాంపస్లు, ప్రైవేట్ హాస్టళ్లు ఈ దందాకు కేరాఫ్ అడ్రస్‌లుగా మారుతున్నాయి. డ్రగ్స్ మత్తులో హత్యలు, అత్యాచారాలు, దాడులు వంటి ఘోర నేరాలు నమోదవుతున్నాయి. పోలీస్ శాఖ గణాంకాల ప్రకారం డ్రగ్స్‌కు సంబంధించిన కేసులు మాత్రమే కాకుండా, వాటి ప్రభావంతో జరిగే నేరాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.

తాజాగా ఇంజినీరింగ్ విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు ఈ దందాకు అలవాటుపడుతున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. అధిక ఆదాయం, తక్కువ సమయంలో డబ్బు సంపాదించే అవకాశంతో ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా ఇంజినీరింగ్, డిగ్రీ కాలేజీ విద్యార్థులు తమ బ్యాగుల్లో పుస్తకాల కింద డ్రగ్స్ పెట్టుకుని దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

యువత లక్ష్యంగా డ్రగ్ నెట్వర్క్
డ్రగ్ మాఫియా ప్రధానంగా కాలేజీలు, హాస్టళ్లు, ఐటీ కారిడార్లను టార్గెట్ చేస్తోంది. సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్స్ ద్వారా గుప్తంగా ఆర్డర్లు తీసుకుని సరఫరా చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడవుతోంది. ఫ్రెండ్ సర్కిల్స్, పార్టీ కల్చర్ ద్వారా డ్రగ్స్ డీలర్లతో పరిచయమై, క్రమంగా బానిసలవుతున్నారు. ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్స్, ఇతరుల ఫోన్ నంబర్లను ఉపయోగించి “డ్రగ్ లైన్” అనే నెట్వర్క్‌ను నడుపుతున్నారు.

పాఠశాలలు, కళాశాల విద్యార్థులు, యువత, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఇందులో ఇరుక్కుంటున్నారు. వీరి ద్వారా గంజాయి, ఎల్ఎస్‌డీ, ఎంఢీఎంఏ వంటి సింథటిక్ డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాలు ఎక్కువగా సరఫరా అవుతున్నాయి. డ్రగ్స్‌కు బానిసైన యువత మానసిక ఆరోగ్యం క్షీణించి, డిప్రెషన్‌లోకి వెళ్లిపోతున్నారు.

డ్రగ్స్ నియంత్రణే లక్ష్యంగా సర్కారు చర్యలు
ప్రభుత్వం డ్రగ్స్ కట్టడికి “ఈగిల్స్” పేరుతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. వీరితోపాటు పోలీసులు, టాస్క్ ఫోర్స్, నార్కోటిక్స్ విభాగం డ్రగ్ మాఫియాపై కఠిన చర్యలు చేపడుతోంది. రైడ్లు, అండర్‌కవర్ ఆపరేషన్లు, ఇంటెలిజెన్స్ ఆధారంగా సరఫరా గొలుసును చెదరగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. విదేశాల నుంచి వస్తున్న సింథటిక్ డ్రగ్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. విద్యాసంస్థల వద్ద తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ కమిషనర్ నగరంలో కళాశాలలు, పాఠశాలల దగ్గర ఉన్న దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.

ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులుగా ప్రకటిస్తోంది. అయినప్పటికీ కొంతమంది యువత తమ అలవాట్లను మార్చుకోలేకపోతున్నారు. డ్రగ్స్ వ్యసనాన్ని అరికట్టడంలో కుటుంబాలు, కాలేజీలు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల ప్రవర్తనలో మార్పులు గమనించి, తక్షణమే కౌన్సెలింగ్ అందించాలి. తద్వారా కొంతమేరైనా ఈ సమస్యను కట్టడి చేయవచ్చు.

Leave a Reply