AP | భారత అంతరిక్ష రంగానికి ఐఐటి తిరుపతి దిశానిర్దేశం

AP | భారత అంతరిక్ష రంగానికి ఐఐటి తిరుపతి దిశానిర్దేశం
ఘనంగా స్పేస్ రౌండ్‌టేబుల్ సమావేశం..
సదస్సులో పాల్గొన్న ఇస్రో, డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ, ప్రముఖ విద్యాసంస్థలు ప్రైవేట్ అంతరిక్ష సంస్థల ప్రతినిధులు
AP | ఏర్పేడు, ఆంధ్రప్రభ : భారతదేశ అంతరిక్ష రంగ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఐఐటి తిరుపతిలో నిర్వహించిన రెండు రోజుల మెహతా ఫ్యామిలీ ఫౌండేషన్ కేర్ రౌండ్‌టేబుల్ సమావేశం విజయవంతంగా ముగిసింది. మెహతా ఫ్యామిలీ ఫౌండేషన్ సహకారంతో జరిగిన ఈ సదస్సులో ఇస్రో, డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ, ప్రముఖ విద్యాసంస్థలు ప్రైవేట్ అంతరిక్ష సంస్థల ప్రతినిధులు పాల్గొని భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించారు.

అంతరిక్ష విద్యలో ఐఐటి తిరుపతి అగ్రగామి:
ఐఐటి తిరుపతి డైరెక్టర్ డాక్టర్ కె. ఎన్. సత్యనారాయణ మాట్లాడుతూ, భవిష్యత్తులో వ్యోమగాములకు శిక్షణ ఇచ్చే కేంద్రంగా, అంతరిక్ష విజ్ఞానానికి చిరునామాగా ఐఐటి తిరుపతి నిలవనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుపతి భౌగోళికంగా శ్రీహరికోటకు దగ్గరగా ఉండటం, ఇక్కడ ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఈ సంస్థకు అదనపు బలమని ఆయన పేర్కొన్నారు.

సదస్సులోని ముఖ్యాంశాలు:
ప్రొఫెసర్ బి.ఎన్. సురేష్: అంతరిక్ష విద్యా విధానంలో ఉన్న లోపాలను సరిదిద్ది, ప్రయోగాత్మక ఫలితాలను ఇచ్చేలా పాఠ్యప్రణాళిక ఉండాలని సూచించారు.
రాహుల్ మెహతా: ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష రంగం ఊహించని రీతిలో పెరుగుతోందని, ఇండియా ఈ దిశగా ముందడుగు వేయడం అత్యవసరమని అన్నారు.
గణేష్ పిళ్ళై: పెరుగుతున్న మానవ వనరుల అవసరాలను తీర్చడంలో ఐఐటి వంటి సంస్థలకు ఇస్రో పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.
శుభాన్షు శుక్లా: ఒక వ్యోమగామిగా తన అనుభవాలను పంచుకుంటూ, స్పేస్ స్కూల్ దృష్టి సారించాల్సిన ప్రాముఖ్యత గల అంశాలను వివరించారు.
నాగభారత్ డాకా: అంతరిక్ష రంగంలో స్టార్టప్‌ల ప్రాముఖ్యతను, శిక్షణ పొందిన సిబ్బంది అవసరాన్ని గుర్తుచేశారు.

స్వదేశీ ఆవిష్కరణలే లక్ష్యం:
గగన్‌యాన్, భారత మానవ అంతరిక్ష యాత్రల నేపథ్యంలో స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన ఆవిష్కరణలు ఎంతో అవసరమని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ ఇ. ఎస్. పద్మకుమార్ అభిప్రాయపడ్డారు. అంతరిక్ష ప్రయోగాలకు కావాల్సిన ప్రత్యేక లోహాలను మన దేశంలోనే తయారు చేసుకోవాలని మిధాని సంస్థ ప్రతినిధి నారాయణమూర్తి నొక్కి చెప్పారు. ఈ రెండు రోజుల మేధోమథనంలో భారతదేశాన్ని అంతరిక్ష విజ్ఞానంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు అవసరమైన పరిశోధనలు, పరిశ్రమల భాగస్వామ్యం, విద్యా కోర్సుల రూపకల్పనపై ఒక స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేశారు.




