చెరువుల అభివృద్ధిపై ఉన్నత స్థాయి సమీక్ష..

చెరువుల అభివృద్ధిపై ఉన్నత స్థాయి సమీక్ష..

తిరుపతిరూరల్, ఆంధ్రప్రభ : తిరుపతి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే లక్ష్యంగా, నేడు తిరుపతిరూరల్ అవిలాల ట్యాంక్ బండ్ అభివృద్ధి, పేరూరు చెరువు నుండి అవిలాల చెరువుకు నీటి అనుసంధానం కల్పించడంపై తుడా, నీటి పారుదల శాఖ అధికారులతో కలిసి సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తుడా ఛైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి అధికారులకు తగిన సూచనలు, సలహాలు చేస్తూ స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు.

ఈ సందర్భంగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇరిగేషన్, రెవెన్యూ, తుడాకి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్, ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులు ఉమ్మడిగా క్షేత్రస్థాయిలో పని చేయాలని మార్గనిర్దేశం చేశారు. పేరూరు చెరువు నుండి అవిలాల వరకు నీటి మళ్లింపు, అనుసంధానం ద్వారా నీటి వనరుల పరిరక్షణకు ప్రాధాన్యతనివ్వాలని తెలిపారు. అవిలాల ట్యాంక్ బండ్‌ను పర్యాటక పరంగా, ప్రజల వినోదం కోసం మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు ఇంజనీరింగ్ పనులపై సుదీర్ఘంగా చర్చించారు.

వనరుల పరిరక్షణతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పటిష్టమైన చర్యలు తీసుకుని, ప్రజలకు ఉపయోగపడే స్థిరమైన, శాశ్వత అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. శెట్టిపల్లి భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని, పారదర్శకత ఉండేలా చూడాలని అధికారులకు తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో తుడా సెక్రటరీ డా యన్ వి శ్రీకాంత్ బాబు, ఎస్ ఈ రవీంద్రయ్య,సీపిఓ దేవికుమారి, భూసేకరణ అధికారి సుజన, తుడా ప్లానింగ్, ఇంజనీరింగ్, ఇరిగేషన్ ఈ ఈ వెంకటేశ్వర ప్రసాద్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply