మున్సిపల్ కో ఆప్షన్ పదవికి పోటాపోటీ..?

మున్సిపల్ కో ఆప్షన్ పదవికి పోటాపోటీ..?
- ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
- 4 స్థానాల పై ఆశావహుల ఆశలు..!
- అధిష్టానం ఆశీస్సులు ఎవరి పైనో…?
- ఎమ్మెల్యే, కౌన్సిలర్ల గ్రీన్ సిగ్నల్ ఎవరికో..?
మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపల్ కో ఆప్షన్ ఎన్నికకు సంబంధించి తాజాగా నోటిఫికేషన్ రావడంతో… కో ఆప్షన్ పదవులకై ఆశావహులలో ఉత్కంఠ నెలకొంది. దీంతో ఎమ్మెల్యే, ఎంపీ, పార్టీ ముఖ్య నాయకులతో పాటు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల ను ప్రసన్నం చేసుకునేందుకు ఇప్పటికే ఆశావహుల ప్రదక్షిణలు సైతం ప్రారంభమయ్యాయి. మైనార్టీ కోటాలో 2 స్థానాలకు, ప్రజా ప్రతినిధులు లేదా రిటైర్డ్ గెజిటెడ్ కోటలో మరో 2 స్థానాలకు కో ఆప్షన్ సభ్యులను ఎంపిక చేయనున్నారు. మైనారిటీ కోటాలో కో ఆప్షన్ కోసం మహ్మద్ అలీ, అబ్దుల్ నబీ,ఎం డి సమీర్, మున్నీర్, జావేద్ , ముద్దం జయశ్రీలు పోటీలో ఉండగా ప్రజాప్రతినిధుల కోటాలో మాజీ వైస్ ఛైర్మన్ బొల్లెపల్లి వెంకటయ్య, మాజీ వార్డ్ సభ్యులు ఎడ్ల శ్రీనివాస్, అవిశెట్టి స్వామి, బుంగపట్ల యాకయ్య, మాజీ కౌన్సిలర్లు కారుపోతుల శిరీష, లెంకల సుజాత, మాజీ కో ఆప్షన్ సభ్యురాలు పోలినేని ఆనందమ్మ, రిటైర్డ్ గెజిటెడ్ కోటాలో మన్నే అంజయ్యలు పోటీలో ఉన్నారు.
అధిష్టానం ఆశీస్సులు ఎవరికో..?
కో ఆప్షన్ పదవి కోసం ఆయా కేటగిరీలలో పదవులు దక్కించుకునేందుకు ఆశావహులు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ,కౌన్సిలర్లు, ముఖ్య నాయకులను స్వయంగా కలిసి తమ ఎన్నికకు సహకరించాలని వారిని ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.కానీ అధిష్టానం మున్సిపల్ ఎన్నికల వేళ కొంతమంది కి కో ఆప్షన్ పద వులను ఆశ చూపి పోటీ నుండి తప్పించారని వారికి కో ఆప్షన్ ఇవ్వాలని,కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్న వాళ్ళకే ఇవ్వాలని, ఇటీవల పార్టీ మారిన జంప్ జిలానిలకు ఇవ్వొద్దని మరికొంతమంది అంటుండగా…మున్సిపల్ కౌన్సిల్ మద్దతు (చెయ్యి ఎత్తడం) ఇస్తేనే కో ఆప్షన్ ఎంపిక అవుతారని,ఎలాగైనా చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల మద్దతు కూడకట్టుకునేందుకు ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అటు ఎమ్మెల్యే, ఇటు ముఖ్య నాయకులు, కౌన్సిల్ మద్దతు కోసం ఆశావహులు విఫల ప్రయత్నాలు చేయక తప్పదని పలువురు వాపోతున్నారు.
ఆర్ధిక బలం అవసరమా..?
ఇప్పటికే ఎన్నో డబ్బులు వెచ్చించి కౌన్సిలర్లు గా గెలవగా… ప్రస్తుతం కో ఆప్షన్ పదవి ఆశించే ఆశావహులు ఆర్ధికంగా ఎంతోకొంత ఎర చూపితే గాని కో ఆప్షన్ పదవులు పొందడం కష్టమేనని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు.
