Lok Sabha seats | తమిళనాడు సీఎం స్టాలిన్‌కు రేవంత్ రెడ్డి కీలక లేఖ

Lok Sabha seats | తమిళనాడు సీఎం స్టాలిన్‌కు రేవంత్ రెడ్డి కీలక లేఖ

Lok Sabha seats | తెలంగాణ, వెబ్ డెస్క్: లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన ఈ ప్రక్రియ చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కొంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు ఆయన కీలక లేఖ రాశారు.

కేవలం జనాభా ఆధారంగా లోక్‌సభ సీట్లను సర్దుబాటు చేయడం అనేది దక్షిణాది రాష్ట్రాల రాజకీయ హక్కులపై జరుగుతున్న దాడిగా రేవంత్ తన లేఖలో అభివర్ణించారు. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రాలు నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ముప్పును అందరికంటే ముందుగానే పసిగట్టి, గత ఏడాది మార్చిలోనే చెన్నై వేదికగా దక్షిణాది నేతలతో సమావేశం నిర్వహించిన సీఎం స్టాలిన్ ముందుచూపును రేవంత్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రశంసించారు.

స్పందించిన స్టాలిన్.. పూర్తి మద్దతు:

సీఎం రేవంత్ రెడ్డి లేఖపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తక్షణమే స్పందించారు. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుకునే దిశగా అందరం ఐక్యంగా నిలబడతామని ఆయన స్పష్టం చేశారు. ఈ పోరాటంలో తమ పూర్తి మద్దతు ఉంటుందని రేవంత్ రెడ్డికి స్టాలిన్ భరోసా ఇచ్చారు. ఈ పరిణామంతో డీలిమిటేషన్ అంశంపై కేంద్రంపై పోరాడేందుకు దక్షిణాది రాష్ట్రాలు ఉమ్మడి వేదికగా సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది.

Leave a Reply