సౌకర్యవంతమైన హాస్టల్ గదులు నిర్మించాలి

సౌకర్యవంతమైన హాస్టల్ గదులు నిర్మించాలి

25లోగా నిధుల ప్రతిపాదనలు సమర్పించాలి
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

సంగారెడ్డి, ఆంధ్రప్రభ: సంగారెడ్డి నియోజకవర్గంలో విద్యార్థుల కోసం నిర్మించనున్న హాస్టల్ భవనాల్లో గదులు విశాలంగా, సౌకర్యవంతంగా ఉండేలా డిజైన్లు చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల అధికారులకు సూచించారు. ఇరుకిరుకు గదుల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఉండాల్సి వస్తే తీవ్రమైన ఇబ్బందులు తలెత్తుతాయని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హాస్టల్ గదుల్లో తగినంత గాలి, వెలుగు ఉండేలా నిర్మాణ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు గదుల్లో చదువుకోవడంతో పాటు చెస్, క్యారమ్స్ వంటి ఆటలు ఆడుకునేంత విస్తీర్ణం ఉండాలని అన్నారు.

హాస్టల్ నిర్మాణాలపై నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం అడిషనల్ కలెక్టర్ ఆర్. పాండు, బీసీ వెల్ఫేర్ అధికారి జగదీష్ తదితరులతో కలిసి వెలుగు కార్యాలయ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న బీసీ గర్ల్స్ హాస్టల్ భవనాన్ని వారు పరిశీలించారు. గదులు, టాయిలెట్లు, డైనింగ్ హాల్, కిచెన్ తదితర సదుపాయాలను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రస్తుత నిర్మాణం విద్యార్థినులకు అనుకూలంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇదే తరహాలో మిగతా హాస్టల్ భవనాలను కూడా నిర్మించాలని అధికారులకు సూచించారు. గదులు విశాలంగా ఉండేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని పదేపదే తెలియజేశారు. అవసరమైన నిధులను ప్రభుత్వం నుంచి మంజూరు చేయించే బాధ్యతను తాను తీసుకుంటానని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా అధికారులు హాస్టల్ నిర్మాణాలకు సంబంధించిన వివరాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న బీసీ గర్ల్స్ హాస్టల్‌కు మొత్తం రూ.2.9 కోట్లు మంజూరవగా, ఇప్పటివరకు రూ.1.5 కోట్లు విడుదలయ్యాయని తెలిపారు. మిగిలిన నిధులు త్వరితగతిన విడుదల చేయాలని కోరారు. స్పందించిన జగ్గారెడ్డి, ఈ విషయాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, మిగిలిన నిధులు త్వరగా విడుదల అయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని హాస్టల్ భవనాలు, అదనపు గదుల నిర్మాణానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఈనెల 25లోగా నిధుల ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు.

Leave a Reply