ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక విజయవంతం చేయాలి

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక విజయవంతం చేయాలి

  • అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి
  • కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశం

సంగారెడ్డి ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 22న (నేడు) నిర్వహించనున్న జిల్లా స్థాయి కార్యక్రమ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ గురువారం సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కార్యక్రమాన్ని ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో ఇప్పటికే ప్రజా పాలన కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించామని, అదే స్ఫూర్తితో జిల్లా స్థాయి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని సూచించారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు, వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలు, ప్రభుత్వం కేటాయించిన నిధుల సమాచారం తదితర అంశాలతో సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

అలాగే జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు, సాధించిన పురోగతిని ప్రజలకు వివరించేలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు రూపొందించాలని తెలిపారు. శాఖల వారీగా అధికారులు పరస్పర సమన్వయంతో బాధ్యతలు నిర్వర్తించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో అడిషనల్ కలెక్టర్లు, జడ్పీ సీఈవో, వివిధ సంక్షేమ శాఖల అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply