ప్రాణం అమూల్యం… జాగ్రత్తే రక్షణ!

ప్రాణం అమూల్యం… జాగ్రత్తే రక్షణ!
మేడపల్లి గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన..
మద్యం డ్రైవింగ్‌కు నో, చిన్నారులకు బైక్‌లు ఇవ్వొద్దని హెచ్చరిక..
నల్లబెల్లి, ఆంధ్రప్రభ : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మేడపల్లి గ్రామంలో రోడ్డు భద్రతపై గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో అవగాహన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అర్రెం సాంబయ్య మాట్లాడుతూ… కుటుంబానికి ఆధారమైన వ్యక్తి ప్రమాదానికి గురైతే ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని అన్నారు.
ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారులో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రత్యేకంగా సెలవు దినాల్లో తల్లిదండ్రులు చిన్నారులకు మోటార్ సైకిళ్లు ఇవ్వకూడదని, ఇది ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అధిక వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ నివారించి జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు మొబైల్ ఫోన్ వినియోగం, గట్టిగా సంగీతం వినడం మానుకోవాలని తెలిపారు. విద్యార్థులను తీసుకువెళ్లే బస్సు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ సిబ్బంది, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.
