ప్రజలకు చేరువగా పోలీసింగ్.. కన్నెపల్లి ఠాణా ప్రారంభం…

ప్రజలకు చేరువగా పోలీసింగ్.. కన్నెపల్లి ఠాణా ప్రారంభం…
నూతన భవనాన్ని ప్రారంభించిన డీజీపీ బి.శివధర్ రెడ్డి
శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలకు మరింత చేరువగా ఉండి మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) బి.శివధర్ రెడ్డి పేర్కొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని శుక్రవారం ఆయన ఘనంగా ప్రారంభించారు. మండల కేంద్రానికి చేరుకున్న డీజీపీకి మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, సీపీ అంబర్ కిషోర్ ఝా సాదరంగా ఆహ్వానం పలికారు.
డీసీపీ భాస్కర్, ఏసీపీ కిరణ్ కుమార్‌లు పుష్పగుచ్ఛాలు అందజేయగా, పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల నుంచి డీజీపీ గౌరవ వందనం స్వీకరించారు. నూతన భవనాన్ని ప్రారంభించిన అనంతరం స్టేషన్‌లో ఎస్‌ఐ భాస్కర్ రావును ఆయన కుర్చీలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ప్రజలకు భద్రతపై భరోసా కల్పించేందుకు అత్యాధునిక సాంకేతికతతో కూడిన భవనాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు.

ఈ నూతన భవనం ద్వారా ప్రజలకు సేవలు మరింత వేగవంతంగా అందుతాయని, శాంతిభద్రతలు బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా రక్షణలో సాంకేతికతను జోడించి నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడతామన్నారు. అనంతరం ఠాణా ఆవరణలో అధికారులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

