కర్నూలులో ఉద్రిక్తతలు…

కర్నూలులో ఉద్రిక్తతలు…

ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట వైసీపీ శ్రేణుల ఆందోళన….

కర్నూలు, ఆంధ్ర‌ప్ర‌భ : నగరంలో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక సోమిశెట్టి కాంప్లెక్స్ లోని ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగడంతో ఉదయం నుంచి పరిస్థితి హీట్‌ అయ్యింది. పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, మాజీ గ్రంథాలయ చైర్మన్ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో ఈ నిరసనలు నిర్వహించబడినట్లు సమాచారం. మహిళలపై అవమానకరమైన వ్యాఖ్యలు ప్రచురించారని ఆరోపిస్తూ ఆంధ్రజ్యోతి పత్రికపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ కార్యకర్తలు, “మహిళలను గౌరవించాలి”, “అసత్య వార్తలు ఆపాలి” అంటూ నినాదాలు చేశారు.

నిరసనకారులు పెద్ద సంఖ్యలో కార్యాలయం వద్దకు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై ముందస్తు సమాచారం అందుకున్న పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ, ఆందోళనకారులు కార్యాలయం వద్దకు చేరుకుని నిరసనలు కొనసాగించారు. కొన్ని చోట్ల తోపులాటలు చోటుచేసుకున్నాయి. పోలీసులు నిరసనకారులను చెల్లాచెదురుగా పంపించే చర్యలు చేపట్టడంతో పరిస్థితి క్రమంగా అదుపులోకి వచ్చింది. సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply