KNL | అభివృద్ధి పనులు వేగ‌వంతం అవ్వాలి : మంత్రి టీజీ భ‌ర‌త్

కర్నూలు బ్యూరో, మే 19 (ఆంధ్రప్రభ) : క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో అభివృద్ధి ప‌నులు వేగ‌వంతం చేయాల‌ని అధికారులు, కాంట్రాక్ట‌ర్ల‌ను రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ ఆదేశించారు. న‌గ‌రంలోని మున్సిప‌ల్ కౌన్సిల్ హాల్‌లో మున్సిప‌ల్ అధికారులు, కాంట్రాక్ట‌ర్ల‌తో ఆయ‌న స‌మావేశం నిర్వ‌హించారు. న‌గ‌రంలోని వివిధ వార్డుల్లో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల‌పై ఆయ‌న‌ చ‌ర్చించారు. ఏ కాంట్రాక్ట‌ర్ ఏయే ప‌నులు చేప‌ట్టారు, ప‌నుల పురోగ‌తి ఏంట‌ని ఆరా తీశారు. ఇంకా మొద‌లు పెట్ట‌ని ప‌నుల విష‌యంలో స‌మాధానం చెప్పాల‌న్నారు. ఇప్ప‌టికే ప‌నులు ప్రారంభించి పూర్తికాని వాటి గురించి చ‌ర్చించారు. ఎప్ప‌టిలోగా ప‌నులు పూర్తి చేస్తారో అడిగి వివ‌రాలు నోట్ చేసుకున్నారు.

త‌క్కువ ధ‌ర‌కు ప‌నులు ద‌క్కించుకుంటే నాణ్య‌త‌తో ఎలా చేస్తార‌ని మంత్రి టీజీ భ‌ర‌త్ ప్ర‌శ్నించారు. త‌మ ప్ర‌భుత్వం జ‌వాబుదారీత‌నంతో ప‌నిచేస్తోంద‌ని, ప్ర‌జ‌ల‌కు మంచి పాల‌న అందించేందుకు క‌ట్టుబ‌డి ఉన్నామ‌న్నారు. వార్డుల్లో చేప‌ట్టే అభివృద్ధి ప‌నుల్లో నాణ్య‌త విష‌యంలో రాజీప‌డే ఉద్దేశం లేద‌న్నారు. త‌మ‌కు చెడ్డ‌పేరు తీసుకొచ్చేలా ప‌నిచేస్తే చూస్తూ ఊరుకునేది లేద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ప‌నులు ప్రారంభించిన త‌ర్వాత నిర్ణీత గ‌డువులోగా పూర్తి చేయాల‌న్నారు. సీఎం చంద్ర‌బాబు నాయుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌, స్పీడ్ ఆఫ్ డూయింగ్ వ‌ర్క్ విధానాన్ని తీసుకొచ్చార‌న్నారు. అందుకు త‌గ్గ‌ట్టే అంద‌రూ ప‌నులు త్వ‌ర‌గా చేయాల‌న్నారు. ప్ర‌జ‌ల‌కు మంచి పాల‌న అందించడంలో అంద‌రూ భాగ‌స్వామ్యం అవ్వాల‌న్నారు.

స‌మావేశంలో కాంట్రాక్ట‌ర్లు మాట్లాడుతూ… కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత త‌మ‌లో ఆత్మ‌స్థైర్యం పెరిగింద‌న్నారు. ప‌లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయ‌ని కాంట్రాక్ట‌ర్లు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. బిల్లుల విష‌యంలో ఆల‌స్య‌మ‌వ్వ‌కుండా చూడాల‌ని అధికారుల‌ను మంత్రి ఆదేశించారు. ఫైల్స్ క్లియ‌రెన్స్ త్వ‌ర‌గా చేయాల‌న్నారు. స‌మావేశంలో మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ య‌స్. ర‌వీంద్ర బాబు, అధికారులు, కాంట్రాక్ట‌ర్లు పాల్గొన్నారు.

పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేయండి… టీజీ భరత్
కర్నూలు బ్యూరో, మే 19, ఆంధ్రప్రభ : నగరంలో పారిశుద్ధ్య పనులను మరింత ముమ్మరం చేయాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ పారిశుద్ధ్య పర్యవేక్షక సిబ్బందిని ఆదేశించారు. సోమవారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో కమిషనర్ యస్.రవీంద్ర బాబుతో కలిసి పారిశుద్ధ్య పర్యవేక్షకులు, కార్యదర్శులు, మేస్త్రిలతో పారిశుద్ధ్యంపై మంత్రి సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నగరంలో పారిశుద్ధ్యంపై ఫిర్యాదులు ఎక్కువ అయ్యాయని, వాటిపై పర్యవేక్షక సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పునరావృతం అవుతున్న సమస్యలు ఫిర్యాదులు వచ్చేంత వరకు వేచి ఉండకుండా, ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రానున్న రోజుల్లో పారిశుద్ధ్య మెరుగుపడకపోతే, ఎక్కడైనా పారిశుద్ధ్యం లోపిస్తే సంబంధిత సిబ్బందే బాధ్యత అని, వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. పారిశుద్ధ్యంలో విశాఖపట్నం తరహాలో నగరాన్ని తీర్చిదిద్దాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కమిషనర్ మాట్లాడుతూ.. పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక విభాగాల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, మురుగు కాలువలపై ఆక్రమణలు, కాలువలు ఎక్కుతక్కులను‌ సరిచేయించుకునే బాధ్యత పారిశుద్ధ్య పర్యవేక్షక సిబ్బంది తీసుకోవాలని ఆదేశించారు. ఇంటింటి చెత్తా సేకరణ వంద శాతం చేపట్టాలని, రహదారులపై, మురుగు కాలువల్లో చెత్తాచెదారం వేస్తే కలిగే అనర్ధాలను ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు.ఈ సమావేశంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి, పారిశుద్ధ్య పర్యవేక్షక అధికారి నాగరాజు, ఇంచార్జీ యస్ఈ శేషసాయి, ఎంఈ సత్యనారాయణ, పట్టణ ప్రణాళిక సర్వేయర్ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *