కుక్కలకు ఆహారం పెట్టొద్దు అంటున్న అధికారులు..
కుక్కలకు ఆహారం పెట్టొద్దు అంటున్న అధికారులు..
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఢిల్లీ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అధికారులు.. ప్రయాణికులకు కీలక అడ్వైజరీ జారీ చేశారు. ఎయిర్‌పోర్ట్ పరిధిలో ఉన్న వీధి కుక్కలకు ఎక్కడపడితే అక్కడ ఆహారం వేయొద్దని స్పష్టంగా సూచించారు. ప్రయాణికుల భద్రత, ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాల సజావుగా కొనసాగింపు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.
అధికారుల ప్రకారం.. ఎయిర్‌పోర్ట్‌లోని మూడు టెర్మినల్స్ పరిధిలో ఉన్న వీధి కుక్కలకు ప్రత్యేక బృందాల ద్వారా నియంత్రితంగా ఆహారం అందిస్తున్నామని వెల్లడించారు. ఇందు కోసం ప్రత్యేక టీమ్స్‌ను ఏర్పాటు చేసి, కుక్కల సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రయాణికులు, సిబ్బంది ఎక్కడపడితే అక్కడ ఆహారం వేయడం వల్ల కుక్కల ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఆహారం కోసం కుక్కలు టెర్మినల్ ప్రాంతాల్లో ఎక్కువగా చేరడంతో, ప్రయాణికులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే విమానాశ్రయ భద్రత, పరిశుభ్రత పరంగా కూడా సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు.
ఈ నేపథ్యంలో, ఎయిర్‌పోర్ట్ పరిధిలో కుక్కలకు ఆహారం వేయకుండా సహకరించాలని ప్రయాణికులను అధికారులు కోరుతున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బృందాల ద్వారా మాత్రమే ఆహారం అందుతుందని, అందరూ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. మొత్తానికి, ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ అధికారులు ఈ అడ్వైజరీ జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎయిర్‌పోర్ట్‌లో క్రమశిక్షణ, పరిశుభ్రతను కాపాడేందుకు అందరూ సహకరించాలని అధికారులు కోరుతున్నారు.
