సేవ చేస్తున్న చేతులకు “శిక్ష”లా.. బాధ్యతలా..?

సేవ చేస్తున్న చేతులకు “శిక్ష”లా.. బాధ్యతలా..?
పెద్దవంగర, ఆంధ్రప్రభ : సిబ్బంది కొరతతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న అంగన్వాడీ వ్యవస్థలో, ఒక దివ్యాంగురాలైన టీచర్ పై అదనపు బాధ్యతలు మోపిన ఘటనకి సంబంధించిన వార్త వెలుగులోకి రావడంతో సమస్య పరిష్కారం అవుతుందనే ఆశలు కలిగాయి. అయితే, అదే విషయం ఇప్పుడు మరో మలుపు తిరిగి, బాధితురాలి పైనే ఒత్తిడి పెంచుతున్న అధికారుల వ్యవహార శైలి కొత్త వివాదానికి దారితీసింది. అంగన్వాడీ కేంద్రాల్లో సిబ్బంది కొరత కారణంగా ఒక దివ్యాంగురాలైన టీచర్ పై భారం మోపిన ఘటన ఇటీవల పత్రికల్లో వెలుగులోకి రావడం తెలిసిందే. అయితే, ఈ సమస్యపై స్పందించి ఉపశమనం కల్పించాల్సిన సంబంధిత అధికారులు, బాధితురాలిపైనే ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు వినిపించడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
“పత్రికలకు చెప్పావా?” అంటూ ప్రశ్నలు..
గ్రామస్తుల సమాచారం ప్రకారం, ఐసిడిఎస్ సూపర్వైజర్ బాధిత టీచర్‌ను ప్రశ్నిస్తూ “పత్రికల్లో వార్తలు వేయించావా..? ఇన్చార్జ్ బాధ్యతలు ఇస్తే నీకేమైనా బరువవుతుందా..?” అంటూ ఆగ్రహంగా మాట్లాడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలు ఒక దివ్యాంగురాలి పై మానసిక ఒత్తిడిని పెంచడమే కాకుండా, అధికారుల బాధ్యతాయుత వైఖరిపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని స్థానికులు అంటున్నారు.
భవనం మార్పు పేరుతో అదనపు ఒత్తిడి
ఇప్పటికే రెండు కేంద్రాల బాధ్యతలు నిర్వహిస్తూ ఇబ్బందులు పడుతున్న బాధితురాలికి, “నీ అంగన్వాడీ కేంద్రం సరిగా లేదు… ఖాళీ చేసి వేరే భవనంలోకి మార్చాలి” అంటూ సూచనలు ఇవ్వడం మరింత భారంగా మారిందని తెలుస్తోంది. సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేయాల్సిన సమయంలో, కొత్త సమస్యలు సృష్టించడం సరికాదని స్థానికులు పేర్కొంటున్నారు.
సమస్యలపై దృష్టి మళ్లింపు…?
మండలంలో ఖాళీగా ఉన్న టీచర్, ఆయా పోస్టులు, పెరుగుతున్న పని భారం వంటి ప్రధాన సమస్యలను పరిష్కరించకుండా, బాధితురాలి పైనే దృష్టి కేంద్రీకరించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. “సమస్యను బయటపెట్టిన వారినే లక్ష్యంగా చేసుకోవడం సరికాదు” అని పలువురు గ్రామస్థులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, దివ్యాంగురాలు అయిన అంగన్వాడి టీచర్ ను వేధింపుల ఆరోపణలను సమగ్రంగా విచారించాలి. అదనపు ఇన్చార్జ్ బాధ్యతలను తొలగించి, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. సమస్యలను పరిష్కరించాలని సమస్యలు సృష్టించొద్దని గ్రామస్తులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
