మహిళపై వేధింపుల కేసులో నిందితులకు జైలు శిక్ష

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ పట్టణం రాజారాం నగర్‌కు చెందిన ఓ మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించి, బెదిరించిన కేసులో నిందితులకు జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు జైలు శిక్ష విధించినట్లు ఎస్సై సీహెచ్. తిరుపతి తెలిపారు.
2023 జనవరి 19న రాజారాం నగర్ కాలనీకి చెందిన వేముల రాకేష్, వెంకవ్వలు అదే కాలనీకి చెందిన ఓ మహిళను వెంబడించి, ఆమెపై అసభ్యకరంగా ప్రవర్తించి బెదిరింపులకు పాల్పడ్డారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు నిందితులపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు.
అప్పటి ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్ రావు కేసును దర్యాప్తు చేసి చార్జ్‌షీట్ దాఖలు చేశారు. అనంతరం కేసును విచారించిన జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు రాకేష్, వెంకవ్వలను దోషులుగా తేల్చింది.
కోర్టు రాకేష్‌కు ఒక సంవత్సరం జైలుశిక్షతో పాటు రూ.4,200 జరిమానా విధించగా, వెంకవ్వకు ఆరు నెలల జైలుశిక్షతో పాటు రూ.700 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.
ఈ కేసులో నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన కోర్టు కానిస్టేబుళ్లు సచిన్, సాగర్, విక్రమ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ దయాకర్ గౌడ్‌లను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అభినందించినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు.
