శివనగర్‌లో తాగునీటి ఘోష..

శివనగర్‌లో తాగునీటి ఘోష..
- నూతన పైపులైన్ వేశారు.. గతంలో వచ్చే నీళ్లు బంద్
- కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. కార్పొరేటర్ మాటలు బేఖాతర్
- కమిషనర్ దృష్టికి తీసుకెళ్తా: కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ కుమార్
కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలోని 34, 35 డివిజన్ల శివనగర్ ప్రాంతంలో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. భగీరథ నీరు అన్ని వీధుల్లోకి సక్రమంగా రావడం లేదని గత నాలుగేళ్లుగా ప్రజలు ప్రజా ప్రతినిధులు, అధికారులకు విన్నవించుకున్నప్పటికీ ఫలితం లేకపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నూతన పైపులైన్ ఏర్పాటు చేసిన తర్వాత గతంలో వస్తున్న తాగునీరు కూడా నిలిచిపోయిందని డివిజన్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా కొంతమేరకు నీరు వస్తుండగా, ఇప్పుడు కొత్త పైపులైన్ కారణంగా పూర్తిగా నీటి సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. కాంట్రాక్టర్ పనితీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
శివనగర్, ఎస్.రెడ్డి నగర్, వాసవి కాలనీ ప్రాంతాల్లో కొత్త పైపులైన్ వేయడంతో ప్రెషర్ పెరిగి అన్ని కాలనీలకు నీరు అందుతుందని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది. కొత్త పైపులైన్ సరిగా అనుసంధానం చేయకపోవడంతో కాలనీలకు వెళ్లే పైపులు సెట్ కాక సమస్య తలెత్తిందని స్థానికులు చెబుతున్నారు.
ఈ విషయంపై 35వ డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ కుమార్‌ను వివరణ కోరగా, నూతన పైపులైన్ వేసిన తర్వాత కొన్ని వీధులకు తాగునీరు సక్రమంగా అందడం లేదని తన దృష్టికి వచ్చిందన్నారు. త్రాగునీటి సరఫరా సిబ్బందిని ప్రశ్నించగా, కాంట్రాక్టర్ చేసిన లోపాల వల్ల పైపులైన్ అనుసంధానం సరిగా జరగక సమస్య ఏర్పడిందని సమాచారం అందిందన్నారు.
కాంట్రాక్టర్‌ను పలుమార్లు ప్రశ్నించినప్పటికీ ‘రేపు, మర్నాడు’ అంటూ సమస్యను వాయిదా వేస్తున్నారని కార్పొరేటర్ తెలిపారు. రెండు రోజులలో సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని, అవసరమైతే నగరపాలక సంస్థ కమిషనర్ దృష్టికి సమస్యను తీసుకెళ్తానని కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ కుమార్ డివిజన్ ప్రజలకు హామీ ఇచ్చారు.
