అమరావతికి చట్టబద్ధత.. దుర్గమ్మ కు ప్రత్యేక పూజలు

అమరావతికి చట్టబద్ధత.. దుర్గమ్మ కు ప్రత్యేక పూజలు
- సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతి, నవచండీ హోమాలు..
- రాష్ట్రాభివృద్ధికి అమ్మవారిని ప్రార్థించిన దేవస్థానం అధికారులు..
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ ; ఆంధ్రుల ప్రజా రాజధాని అమరావతికి భారత పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించిన సందర్భంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆదివారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. సంకష్టహర చతుర్థి పురస్కరించుకుని రాష్ట్ర అభివృద్ధి, అమరావతి మహాజ్వల వికాసం, ప్రజలకు సర్వత్రా విజయాలు కలగాలని సంకల్పంతో దేవస్థానం పాత యాగశాలలో ఉదయం 9 గంటలకు గణపతి హోమం, నవచండీ హోమం నిర్వహించారు.

ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వి.కె. శీనానాయక్, ధర్మకర్తల మండలి సభ్యులు కళావతి, సరోజినీ దేవి, ప్రత్యేక ఆహ్వానితులు వి. శంకర బాబు తదితరులు ఈ పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు వి. శివప్రసాద్ శర్మ, ఉప ప్రధాన అర్చకులు కోట ప్రసాద్ ఆధ్వర్యంలో పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి సంకల్పం నెరవేరాలని, అమరావతి రాజధాని అభివృద్ధి చెందాలని, రాష్ట్ర ప్రజలందరూ అభివృద్ధి ఫలాలు పొందాలని సంకష్టహర చతుర్థి సందర్భంగా కనక దుర్గ అమ్మవారిని ప్రార్థించినట్లు దేవస్థానం చైర్మన్, ఈవో తెలిపారు. అలాగే అమరావతికి చట్టబద్ధత లభించిన సందర్భాన్ని పురస్కరించుకుని, దుర్గ Malleswara స్వామి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఉచితంగా అమ్మవారి లడ్డూ ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని చైర్మన్, ఈవో, అర్చకులు ప్రారంభించారు.

