‘స్వచ్ఛాయుధం’తో ప్లాస్టిక్ రహిత మచిలీపట్నం వైపు అడుగులు

మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మచిలీపట్నం నగరాన్ని ప్లాస్టిక్ వ్యర్థాల రహితంగా, శుభ్రంగా, పచ్చదనంతో నింపిన ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రజలు తమ వంతు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం నగరాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు కలెక్టర్ శుక్రవారం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నగరంలోని రహదారులు భవనాలు శాఖ అతిథి గృహం సమీపంలోని ఎన్జీఓస్ కాలనీలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా పాల్గొని ‘స్వచ్ఛాయుధం’ అనే సాధనం ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రమైన, పచ్చదనంతో నిండిన నగరాన్ని నిర్మించగలమని అన్నారు. మచిలీపట్నాన్ని ప్లాస్టిక్ వ్యర్థాల రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని కోరారు.

కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వ్యర్థాలను సులభంగా ఏరేందుకు ప్రత్యేకంగా రూపొందించిన ‘స్వచ్ఛాయుధం’ను పరిచయం చేశారు. కర్ర చివర చిన్న మేకును అమర్చిన ఈ సాధనం ద్వారా రోడ్లు, వీధులు, ప్రజా ప్రదేశాల్లో పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను సులభంగా సేకరించవచ్చని తెలిపారు.

అలాగే ప్రతిరోజూ 15 నుంచి 30 నిమిషాల పాటు ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వారిని ‘స్వచ్ఛ యోధులు’గా గుర్తించనున్నట్లు వెల్లడించారు. యువత, మహిళలు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సేవకులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమం ద్వారా ప్లాస్టిక్ లిట్టరింగ్ తగ్గించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, మున్సిపల్ సిబ్బంది డ్రెయినేజ్ క్లీనింగ్, కమర్షియల్ శానిటేషన్ వంటి కీలక పనులపై మరింత దృష్టి సారించే అవకాశం కలుగుతుందని తెలిపారు. ప్రజల సహకారంతో మచిలీపట్నాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దవచ్చని ఆయన అన్నారు.

“మన నగరం – మన బాధ్యత” అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఆసక్తి గల వారు తమ పేర్లను నమోదు చేసుకుని ‘స్వచ్ఛ యోధులు’గా సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ బాపిరాజు, సహాయ కమిషనర్ గోపాలరావు, ఎన్నారై డాక్టర్ వడ్లమూడి రాజేంద్ర, మానవత స్వచ్ఛంద సేవా సంస్థ రాష్ట్ర కన్వీనర్ పి. శ్రీరామ్, మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply