కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను ఎండగట్టాలి

కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను ఎండగట్టాలి

  • మాజీ మంత్రి హరీష్ రావు పిలుపు
  • బీఆర్ఎస్‌లో చేరిన బొల్లారం కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : పటాన్‌చెరు నియోజకవర్గంలోని బొల్లారం ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎండీ ఆరిఫ్‌తో పాటు మరో 25 మంది సభ్యులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బాలరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు గులాబీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు పార్టీ ఇన్‌ఛార్జి ఆదర్శ్ రెడ్డి సహా పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, ప్రస్తుత రాజకీయాల్లో సోషల్ మీడియా ప్రాముఖ్యత రోజురోజుకూ పెరుగుతోందన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజా సమస్యలను వెలుగులోకి తేవడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలు, దుర్మార్గాలను చూసి సహించలేక సోషల్ మీడియా కోఆర్డినేటర్లు, సభ్యులు బీఆర్ఎస్ పార్టీలో చేరడం అభినందనీయమని అన్నారు.

పార్టీలో చేరిన యువతకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని ఆయన ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవడం, కొత్త ఉద్యోగాల కల్పనలో విఫలం కావడం, రెండు లక్షల ఉద్యోగాల హామీ నెరవేర్చకపోవడం వంటి అంశాలను ప్రస్తావించారు.
పథకాల అమలులో విఫలం
అలాగే వృద్ధాప్య పెన్షన్ల పెంపు, మహిళలకు నెలకు రూ. 2500 ఆర్థిక సహాయం, రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం వంచించిందని అన్నారు.

ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని పేర్కొంటూ, సోషల్ మీడియాలో చురుకుగా ఉండే యువత ముందుకు వచ్చి ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రతి మోసాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రజలందరికీ చేరేలా చేయాల్సిన బాధ్యత యువతపై ఉందని హరీశ్ రావు పేర్కొన్నారు. పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply