TVK Vijay | నేటి నుంచి TVK పార్టీ ఎన్నికల ప్రచారం..

TVK Vijay | నేటి నుంచి TVK పార్టీ ఎన్నికల ప్రచారం..

TVK Vijay |ఆంధ్రప్రభ వెబ్‌ డెస్క్ : టీవీకే పార్టీ నేటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించనుంది. పార్టీ అధినేత విజయ్ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పెరంబూరు నుంచి ప్రచారం స్టార్ట్ చేయనున్నారు. చెన్నైలో ఐదుచోట్ల ఎన్నికల ప్రచారానికి ఏర్పాట్లు చేశారు. ప్రజల్లోకి వెళ్లి పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణను వివరించాలనే లక్ష్యంతో టీవీకే ముందుకు సాగుతోంది. పార్టీ స్థాపన అనంతరం మొదటిసారి భారీ స్థాయిలో ఎన్నికల ప్రచారం చేపడుతున్న టీవీకే, యువత, సామాన్య ప్రజలను ఆకర్షించేలా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసింది. ముఖ్యంగా విద్య, ఉపాధి, సామాజిక న్యాయం, అవినీతి నిర్మూలన వంటి అంశాలను ప్రధాన అజెండాగా తీసుకుని ప్రచారం కొనసాగించనుంది.

తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ సభలు, రోడ్ షోలు, ప్రజా సమావేశాలు నిర్వహించేందుకు పార్టీ కార్యాచరణ రూపొందించింది. విజయ్ స్వయంగా ప్రజల మధ్యకి వెళ్లి పార్టీ విజన్‌ను వివరించనున్నారు. ఈ ప్రచారంతో రాజకీయంగా టీవీకే బలం పెరుగుతుందని పార్టీ నాయకులు భావిస్తున్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టీవీకే వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుండగా, ఇతర రాజకీయ పార్టీల దృష్టి కూడా ఇప్పుడు టీవీకే ప్రచారం పైనే కేంద్రీకృతమైంది. కొత్త పార్టీగా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన టీవీకే ప్రచారం ఎలా ప్రభావం చూపుతుందో చూడాలి.