వెండి పల్లకీ పై దుర్గా మల్లేశ్వరులు …

వెండి పల్లకీ పై దుర్గా మల్లేశ్వరులు …

ఊరేగింపులో దుర్గామల్లేశ్వరుల దర్శన భాగ్యం..
భక్తుల జయజయధ్వానాలు

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : శ్రీ దుర్గామల్లేశ్వరుల చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం వెండి పల్లకీ ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. మల్లేశ్వర మహామండపం ప్రారంభమైన వెండి పల్లకీ సేవకు ముందు ఆలయ ఈవో వీకే శీనా నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పల్లకీ ఊరేగింపు భక్తి శ్రద్ధలతో సాగింది.

తప్పెట్లు, కోలాట నృత్యాలు, తాళభజన వంటి సంప్రదాయ కళాప్రదర్శనలు ముందుండగా, దుర్గామల్లేశ్వరుల పల్లకీ కనకదుర్గానగర్, రథం సెంటర్, బ్రాహ్మణవీధి, కొత్తపేట, మెయిన్ బజార్ ప్రాంతాల గుండా ఊరేగింది. మార్గమంతా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని హారతులు సమర్పిస్తూ జయజయధ్వానాలు చేశారు. పల్లకీ ముందుగా భక్తులు రహదారులను పసుపునీటితో శుద్ధి చేసి, కొబ్బరికాయలు కొట్టి స్వాగతం పలికారు. అనంతరం ఊరేగింపు తిరిగి ఇంద్రకీలాద్రికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ, వేద పండితులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply