టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం..

టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం..

.ఘనంగా ఎన్టీఆర్‌కు నివాళులు…
.కార్యకర్తలే పార్టీ బలం అని నేతల వ్యాఖ్యలు.

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కర్నూలు జిల్లా పార్టీ కార్యాలయంలో పార్లమెంటు అధ్యక్షులు గుడిసె ఆది కృష్ణమ్మ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకుడు కీర్తిశేషులు నందమూరి తారకరామారావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ముందుగా పార్టీ కార్యాలయం ఆవరణలో పార్టీ పతాకావిష్కరణ నిర్వహించి, అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, శాసనమండలి సభ్యుడు బెందుల తిరుమల నాయుడు, కుడా చైర్మన్ వెంకటేశ్వర్లు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి పూల నాగరాజు యాదవ్, రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్, కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప, ఆకెపోగు ప్రభాకర్, ఎం. మల్లికార్జునరెడ్డి తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో మంత్రి టీజీ భరత్, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, డాక్టర్ కెవి సుబ్బారెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి ఒకరికొకరు పంచుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం నందమూరి తారకరామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు ఎన్టీఆర్ తొమ్మిది నెలల పాటు ప్రజల్లో తిరిగి, 1983 ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బతీశారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్టీఆర్ మాండలిక వ్యవస్థను ప్రవేశపెట్టి పరిపాలనను ప్రజలకు చేరువ చేశారని, రెండు రూపాయలకు కిలో బియ్యం, తక్కువ ధరకే గృహనిర్మాణం, చీర–దోతి పంపిణీ, వృద్ధాప్య పెన్షన్లు వంటి పథకాల ద్వారా పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేశారని నాయకులు వివరించారు. “సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు” అనే భావనతో పాలన సాగించిన మహానేతగా ఎన్టీఆర్ నిలిచారని కొనియాడారు.

ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుందని, నారా లోకేష్ కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక నిధులు ఏర్పాటు చేసి, సభ్యులకు రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా కల్పించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. పార్టీ ఈ స్థాయికి చేరడానికి కార్యకర్తలే మూలమని, వారికి తగిన గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమం అనంతరం కర్నూలు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేసి సీనియర్ నాయకులను సన్మానించారు. సన్మానం పొందిన వారిలో నర్సప్ప, హరిజన వనుమన్న, బి. వెంకటకృష్ణనాయుడు, బసలదొడ్డి ఈరన్న, కె. రామాంజనేయులు, బి.సి. వెంకటస్వామి, ఆర్యశంకర్, నంది మధు, చంద్రకాంత్, పి. హనుమంతరావు చౌదరి, సి. అరుణకుమారి, పద్యావతమ్మ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై వేడుకలను విజయవంతం చేశారు.

Leave a Reply