అమరావతికి చట్టబద్ధత కోరుతూ తీర్మానం చేయడం హర్షణీయం

అమరావతికి చట్టబద్ధత కోరుతూ తీర్మానం చేయడం హర్షణీయం

  • ఎంపీ కేశినేని శివనాథ్ ( చిన్ని)

విజయవాడ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాద్ (చిన్ని) హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటనలో అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ చారిత్రాత్మక తీర్మానంతో అమరావతి రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందటమే కాకుండా, రాష్ట్రం సైతం అన్ని రంగాలలోనూ పురోభివృద్ధి సాధిస్తుందన్నారు.

గత వైసీపీ ప్రభుత్వ దుష్ట పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా ఉందన్నారు. అమరావతి ప్రాంతం పై అక్కసుతో రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పట్లో మూడు ముక్కలాట ఆడిందన్నారు. రాష్ట్ర ప్రజలు సైతం ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తమ రాష్ట్ర రాజధాని ఏదో చెప్పుకోలేని స్థితికి నాటి వైసిపి ప్రభుత్వం రాష్ట్రాన్ని దిగజార్చిందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనే రాష్ట్ర ప్రజలు వైసీపీని 11 సీట్లకు పరిమితం చేశారన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి ప్రాంతానికి చట్టబద్ధత కల్పించడం కేంద్రాన్ని కోరడం, రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి శాశ్వత రాజధానిగా ఉండేలా అసెంబ్లీ వేదికగా తీర్మానం చేయటం శుభపరిణామం అన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై విజన్ ఉన్న నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం బాటలు వేస్తుందన్నారు.

అమరావతికి రాజధానిగా చట్టబద్ధత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి తమ నిర్ణయాన్ని పంపటం పట్ల ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని, కానీ ఇప్పటికీ కూడా వైయస్ఆర్సీపీ ప్రభుత్వం అమరావతి రాజధాని విషయంలో స్పష్టత ఇవ్వడం లేదన్నారు. ఇదే వైఖరి వైసిపి కొనసాగిస్తే రానున్న కాలంలో పార్టీని రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో కనుమరుగు చేయటం ఖాయం అని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పేర్కొన్నారు.

Leave a Reply